సాధారణ మరణాలపై తప్పుడు ప్రచారం - టీడీపీ నేతలపై సీఎం జగన్ ఆగ్రహం : కల్తీ మద్యంపై ఉక్కుపాదం..!!
జంగారెడ్డిగూడెం మరణాలపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. సాధారణ మరణాలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ రోజు సభ ప్రారంభం అయినప్పటి నుంచి ఇదే అంశం పైన టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. తాము ఈ అంశం పైన చర్చ కోసం వాయిదా తీర్మానం ఇచ్చామని..చర్చ చేపట్టాలని డిమాండ్ చేసారు. వారి ఆందోళనతో సభ మూడు సార్లు వాయిదా పడింది. ఆ తరువాత ప్రభుత్వం ప్రకటన చేసేందుకు సిద్దమైంది.
ఆ సమయంలో మరోసారి టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగటంతో అయిదుగురు టీడీపీ సభ్యుల పైన స్పీకర్ ఈ సెషన్స్ మొత్తం సస్పెన్షన్ వేటు వేసారు. తరువాత ప్రభుత్వం నుంచి ఈ మొత్తం ఘటన పైన వివరణ ఇచ్చారు. సీఎం జగన్ ఇది ఉద్దేశ పూర్వకంగా చేస్తున్న ప్రచారంగా పేర్కొన్నారు. కల్తీ మద్యం మరణాలు గతంలోనే అనేక సార్లు జరిగాయని చెప్పారు. తమ ప్రభుత్వంలో 43 వేల బెల్టు షాపులను రద్దు చేసామన్నారు. కల్తీ మద్యాన్ని తమ ప్రభత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోందని చెప్పారు. అన్ని మరణాలు ఒకే చోట జరిగినవి కాదు. సాధారణ మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు.

Recommended Video
ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సైతం దీని పైన ప్రకటన చేసారు. టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తాను అధికారులతో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించానని చెప్పారు. సహజ మరణాలతో టీడీపీ శవ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. నలుగురు వ్యక్తులే ఆస్పత్రిలో చేరారని వివరించారు. వారం రోజుల వ్యవధిలో 18 మంది మరణించారని చెప్పారు. వారిలో 15 మంది ఇంటి వద్దనే ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఇలా మరణించిన వారి పోస్టు మార్టం నివేదిక వస్తే అందులోని వాస్తవాలు చూసిన తరువాత టీడీపీ నేతలకు నోట మాట బయటకు రాదని మంత్రి చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications