ఆరోగ్యశ్రీ సేవలపై నెట్వర్క్ ఆస్పత్రులతో నేడు ప్రభుత్వచర్చలు.. సఫలమవుతాయా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబరు 29వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రకటించి వైసీపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆరోగ్యశ్రీ చికిత్సల ఫీజుల బకాయిలు చెల్లింపులో తీవ్ర జాప్యం చేయడంతోపాటు, పదేళ్లుగా ప్యాకేజీ ధరలు పెంచక పోవడం పట్ల అందోళన వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ పేర్కొంది.
గత కొద్ది నెలలుగా వైసిపి ప్రభుత్వం తీరుతో తీవ్ర అసహనంతో ఉన్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. గతంలో కూడా ఆందోళనలు కొనసాగించిన సమయంలో బకాయిల విడుదలపై ప్రభుత్వం డిసెంబర్ నెలలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించకపోవడంతో తాము ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందించలేమని ఆసుపత్రులు నిర్ణయం తీసుకున్నాయి.

ఇక ఈ క్రమంలో నెట్వర్క్ ఆస్పత్రులు ఇచ్చిన నోటీసులపై వైసీపీ ప్రభుత్వం స్పందించింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వారిని చర్చలకు ఆహ్వానించింది.ఈ చర్చల నేపథ్యంలో ఇప్పటికే ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆర్ధిక శాఖ అధికారులతో మంగళగిరిలో సమావేశం నిర్వహించారు. బకాయిలు విడుదలపై ఏం చేద్దామని చర్చించారు.
నేడు నిర్వహించనున్న సమావేశానికి ఆరోగ్య శాఖ అధికారులతో పాటు ఆర్థిక శాఖ అధికారులు కూడా హాజరు అయ్యే అవకాశం ఉందని సమాచారం . ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత నిర్ణయానికి మరోవైపు వైద్య కళాశాలల యాజమాన్య సంఘం కూడా మద్దతు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ అండ్ డెంటల్ కళాశాలల యాజమాన్య సంఘం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
హాస్పిటల్స్ అసోసియేషన్ వారు తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ మద్దతు ఉంటుందని పేర్కొంది. ఆరోగ్యశ్రీ కింద రావలసిన బకాయిలు భారీగానే ఉన్నాయని తెలిపిన మెడికల్ అండ్ డెంటల్ కళాశాలలు యాజమాన్యం, ప్యాకేజీల ధరలు పెంచుకోవడంతో కూడా హాస్పిటల్స్ నష్టపోతున్నాయి అని పేర్కొంది. మరి నేడు చర్చలు జరగనున్న నేపధ్యంలో చర్చలు సఫలం అవుతాయా అన్నది ఉత్కంఠగా మారింది.












Click it and Unblock the Notifications