ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..! తుంగభద్ర, కాటన్ బ్యారేజ్ లకు కొత్త గేట్లు..!
ఏపీలో గత ఐదేళ్లుగా కీలకమైన ప్రాజెక్టులు, బ్యారేజ్ లకు సకాలంలో మరమ్మత్తులు చేయకపోవడంతో ప్రమాదకర స్ధితిలో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రాజెక్టుల భద్రత, నిర్వహణ విషయంలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇందులో భాగంగా పలు డ్యామ్ లకు కొత్త గేట్ల బిగింపుతో పాటు మరమ్మత్తులు కూడా చేపడతామన్నారు.
సీఎం చంద్రబాబు జల వనరుల నిర్వహణ ఆలోచన విధానం సత్ఫలితాలు ఇచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గతేడాదితో పోల్చితే గ్రౌండ్ వాటర్ , మేజర్, మీడియం రిజర్వాయర్ లలో నీటినిల్వలు పెరిగాయన్నారు. ఈ ఏడాది వర్షపాతం తో పోల్చితే, మైనస్ 9 శాతం రైన్ ఫాల్ తక్కువగా ఉన్నాకూడా భూగర్భజలాలు, మేజర్, మీడియం రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఉన్నాయంటే, అదంతా చంద్రబాబు వాటర్ మేనేజ్మెంట్ వల్లే సాధ్యం అయిందన్నారు.

ఈ సందర్భంగా తుంగ భద్ర డ్యామ్ గేట్లు మార్చమని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి నిమ్మల తెలిపారు. 209 కోట్లతో శ్రీశైలం ప్రాజెక్టు లో పెండింగ్ పనులు చేయాలని సూచించారన్నారు. అలాగే కాటన్ బ్యారేజ్ కు కొత్త గేట్ల ఏర్పాటుకు 138 కోట్లు కేటాయించి, వచ్చే సీజన్ కు పూర్తి చేయాలని ఆదేశించారని తెలిపారు. రాయలసీమ లో కీలకమైన గోరకల్లు రిజర్వాయర్ ప్రమాదకరంగా ఉంటే గత ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. వచ్చే సీజన్ నాటికి గోరకల్లు రిజర్వాయర్ కి మరమ్మతులు పూర్తి చేసేలా 56కోట్లు కేటాయించారని తెలిపారు.

గత ఐదేళ్లలో చేయలేని పనిని ఒక్క ఏడాదిలోనే హంద్రీ నీవా పనులు పూర్తిచేసి కుప్పంకు నీరందించినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. హంద్రీ నీవా ద్వారా 497 చెరువులకు నీరు అందించేలా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారన్నారు. 2026 జూన్ కి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు వంశధార, నాగావళి, జంఝావతి, మహేంద్ర తనయ, వంటి కీలకమైన 9 ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు.

వరికపూడిశెల ప్రాజెక్ట్ కు ఉన్న అడ్డంకులను అధిగమించేలా అనుమతులు తీసుకోవాలని సీఎం సూచించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రం లో 1040లిఫ్ట్ లు ఉంటే 613 లిఫ్ట్ లు పనిచేయడంలేదని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో రిపేర్లకు ఒక్క రూపాయి ఖర్చు చేయకపోవడంతో లిఫ్ట్ స్కీం లు మరుగున పడ్డాయన్నారు. ఐదేళ్లు పాలన విధ్వంసం వైపు తీసుకెళ్లారు. ఐడీసీ నే దీనికి ఉదాహరణ అన్నారు. ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టుకుని రాష్ట్రంలో కరువు లేకుండా చేయడమే చంద్రబాబు లక్ష్యమని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications