టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్..! తాజా ముహుర్తం ఇదే..!
ఏపీలో ప్రభుత్వాలు మారుతున్నా టిడ్కో ఇళ్ల లబ్దిదారుల ఇబ్బందులు మాత్రం తీరడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త కష్టాలు ఎదురవుతున్నాయనే ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇవాళ ఏపీ మంత్రి వర్గ ఉపసంఘం భేటీ అయింది. అనంతరం మున్సిపల్ మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు.
ఇవాళ అమరావతి సచివాలయంలో భూసంస్కరణలపై వేసిన మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం, అందరికీ ఇళ్లు అంశంపై వేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశానికి మున్సిపల్ మంత్రి నారాయణ హాజరయ్యారు. విడివిడిగా జరిగిన రెండు సమావేశాలకు సహచర మంత్రులు అనగాని సత్య ప్రసాద్,ఫరూక్,పార్థసారథి,అధికారులతో కలిసి మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ భేటీలో టిడ్కో ఇళ్ల నిర్మాణం, పంపిణీపై మంత్రులు చర్చించారు.

అనంతరం మాట్లాడిన మున్సిపల్ మంత్రి నారాయణ.. రాష్ట్రంలో 2014-19 మధ్య 7 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. వీటిలో 5 లక్షల ఇళ్లకు పాలనా అనుమతులు తీసుకుని నిర్మాణాలు కూడా ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం వీటిని 2,60,000కు కుదించిందన్నారు. అనేక పాలసీలు మార్చి గందరగోళానికి గురి చేసిందని నారాయణ ఆరోపించారు.

ఈ నేపథ్యంలో పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి నారాయణ తెలిపారు. దీంతో సబ్ కమిటీ సమావేశంలో టిడ్కో ఇళ్ల పూర్తిపై చర్చించినట్లు ఆయన వెల్లడించారు. వచ్చే జూన్ నెలాఖరులోగా 2,60,000 టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. అప్పటిలోగా అన్ని సమస్యలు పరిష్కరించి లబ్దిదారులకు ఇళ్లు అందజేస్తామన్నారు.












Click it and Unblock the Notifications