Chandrababu: మహానాడు జరగకుండా ప్రభుత్వం నుంచి అడ్డంకులు??
తెలుగుదేశం పార్టీ పండగ మహానాడు ఈనెల 27, 28వ తేదీల్లో ఒంగోలులో జరగబోతున్న సంగతి తెలిసిందే. కార్యక్రమం విజయవంతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం పలు రూపాల్లో అడ్డంకులు సృష్టిస్తోందా? సాధ్యమైనంతవరకు కార్యక్రమంపై మీడియా దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తోందా? అనే ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నుంచి ఔననే సమాధానం వస్తోంది. అడ్డంకులు సృష్టించాలని చూస్తే ఖబడ్దార్ అంటూ ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అడ్డుకోవడానికి రవాణాశాఖ ప్రయత్నాలు
మహానాడుకు ఎవరూ వాహనాలు సమకూర్చకుండా రవాణాశాఖ ప్రయత్నాలు చేస్తోందని, అధికారులనేవారు అధికార పార్టీ నేతల ప్రయివేటు ఉద్యోగులు కాదని, అలా చేసినవారిని కచ్చితంగా గుర్తుపెట్టుకుంటామన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు, సమావేశాలు పెట్టుకునే హక్కుంటుందని, జగన్మోహన్‌రెడ్డి యాత్ర చేసే సమయంలో తాము కూడా అలా అనుకుంటే యాత్ర జరిగేదా? అని ప్రశ్నించారు.
అనవసరంగా తెలుగుదేశం పార్టీవారిని రెచ్చగొడితే తీవ్ర పరిణామాలుంటాయని ప్రభుత్వానికి తెలియజేయండని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఉద్బోధించారు.

అతి చేసిన అధికారులకు భవిష్యత్తులో మూల్యం తప్పదు
అతి చేసిన అధికారులను గుర్తుంచుకుంటామని, భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతద్వారా మహానాడుకు ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని, వారిని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎక్కడికక్కడప్రయత్నాలు చేస్తోందన్నారు. బాగా అతి చేయడం, లేదంటే అసలు పట్టించుకోకుండా పోలీసుశాఖ వ్యవహరిస్తోందని, తన రాయలసీమ పర్యటనలో పోలీసులు కనీ భద్రత కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

రాష్ట్రంలో మారబోతున్న రాజకీయ ముఖచిత్రం
మహానాడు ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, రాష్ట్రంలో మారబోతున్న రాజకీయ ముఖచిత్రానికి మహానాడు వేదిక అని చంద్రబాబు అభివర్ణించారు. పోలీసులు ఎక్కడా సహకరించే అవకాశం కనపడటంలేదని, మనమే సొంతంగా కార్యకర్తలను ఏర్పాటుచేసుకొని మహానాడు రెండురోజులు సజావుగా సాగేలా ఏర్పాట్లు చేసుకుందామన్నారు. ప్రజలు కూడా లక్షల సంఖ్యలో హాజరయ్యే అవకాశం కనపడుతోందని పార్టీ ఏపీ అధ్జ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.












Click it and Unblock the Notifications