జిల్లాల విభజనపై మార్చి 3వరకు అభ్యంతరాల స్వీకరణ-రాయలసీమలోనే 1600
జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా మార్చి 3వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకుంటామని ఏపీ ప్రణాళికా శాఖకార్యదర్శి విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇవాళ కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ లో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రాయలసీమలోని అనంతపురం, కర్నూలు చిత్తూరు జిల్లాలకు చెందిన కలెక్టర్లు, కడప జిల్లాకు చెందిన జాయింట్ కలెక్టర్ తో సమావేశం నిర్వహించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు.
జిల్లాల విభజనపై రాయలసీమలో నాలుగు జిల్లాల ప్రజల యొక్క ఆలోచనలు, ఆకాంక్షల్ని ఇవాళ తెలుసుకున్నట్లు ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. కొన్ని జిల్లాల్లో కొత్త జిల్లాలు, రెవెన్యూ అభ్యంతరాల స్వీకరణకు మార్చి 3వ తేదీ వరకు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. అనంతరం వచ్చిన అభ్యంతరాలు, సలహాలు మీద వాస్తవ పరిస్థితి ఏ విధంగా ఉందో చూసుకుని కలెక్టర్ లు వారి ఆలోచనలను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. అనంతరం ప్రతి అంశంపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని తుది నోటిఫికేషన్ ఇస్తుందన్నారు. తుది నోటిఫికేషన్ వచ్చాక జిల్లాలు ఏ రోజు నుంచి అమల్లోకి వస్తాయన్నది తుది నోటిఫికేషన్లో తెలియజేస్తామన్నారు.

కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను నిర్మించాలన్నది సీఎం జగన్ ఆలోచన అని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని విజయ్ కుమార్ తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు ఆ ప్రక్రియ సమాంతరంగా జరుగుతుందన్నారు. ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడు కొత్త జిల్లాలో పనిచేయాల్సినటువంటి ఆదేశాలు మాత్రమే ఇస్తున్నామని, విభజన ప్రక్రియ క్రమంగా సాగుతుందన్నారు. ఉద్యోగుల విభజన అనేది వెంటనే జరగదన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో జోన్ల ఏర్పాటులో పెద్దగా ఇబ్బంది లేదని, రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదని, జోనల్ స్థాయిలో కూడా ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కువ ఇబ్బంది లేదని, గ్రామ స్థాయిలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. జిల్లా స్థాయిలో ఉన్న చోట్ల కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందన్నారు.
రాయలసీమలో నాలుగు జిల్లాలకు సంబంధించి దాదాపు 1600 అభ్యంతరాలు వచ్చాయని ఆయన తెలిపారు.అనంతపురం జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రం పెనుకొండ గానీ, హిందూపురం గాని పెట్టాలని పుట్టపర్తి పెట్టారనే భావన వ్యక్తమైందని, ఆ అంశం పూర్తిగా పరిశీలనలో ఉందన్నారు. దీంతోపాటు రామగిరి మండలాన్ని అనంతపురం రెవెన్యూ డివిజన్ లో కలపాలని అడుగుతున్నారన్నారు. కర్నూలు జిల్లాకు సంబంధించి పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాలలో ఉంచమని, అవకాశం ఉంటే కొత్త జిల్లాలు ఇంకా ఏర్పాటు చేయమని కొన్ని దరఖాస్తులు వచ్చాయన్నారు. కడప జిల్లాకు సంబంధించి ప్రధానంగా రాజంపేట జిల్లా కేంద్రంగా ఉండాలని, చిత్తూరు జిల్లాకు సంబంధించి నగరిని తిరుపతిలో ఉంచాలని ప్రధానమైన అంశాలపై దరఖాస్తులు వచ్చాయన్నారు












Click it and Unblock the Notifications