అన్ని శాఖలకు చంద్రబాబు సర్కార్ వార్నింగ్-ఇక క్రిమినల్ చర్యలే..!
ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి 75 రోజులు కావస్తోంది. ఈ రెండున్నర నెలల కాలంలో రాష్ట్రంలో పలు సంచలన ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ఇకపై అలాంటి మరో ఘటన జరిగితే క్రిమినల్ చర్యలు తప్పవని అన్ని శాఖలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ అన్ని శాఖల అధిపతులకు ఆదేశాలు ఇచ్చారు.
అసలు విషయానికొస్తే.. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పాటు తథ్యమని తేలిపోయాక వరుసగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది పలు చోట్ల కీలక దస్త్రాలు తగులబెట్టేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఫైల్స్ ను ఎక్కడెక్కడికో తీసుకెళ్లి మరీ కాల్చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పలువురు అధికారుల ఆదేశాలతోనే ఇలా ఫైల్స్ దహనం కొనసాగుతుండటంతో సర్కార్ ఇప్పటికే స్పందించి బాధ్యులపై కేసులు నమోదు చేస్తోంది. అయినా ఈ దహనాలు ఆగడం లేదు.

తాజాగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ ను కూడా కొందరు దహనం చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. అంతకు ముందు మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫైల్స్ తగులబడ్డాయి. దీనికి ముందు కాలుష్య నియంత్రణ మండలి ఫైల్స్ కూడా కృష్ణానది కరకట్టపై తగులబెట్టారు. ఈ నేపథ్యంలో ఇకపై ఎక్కడైనా ఫైల్స్ తగులబెట్టినట్లు గుర్తిస్తే బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ అన్ని శాఖలకు హెచ్చరికలు పంపారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా పేపర్లు తగలబెడితే కఠిన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
అలాగే ఉన్నతాధికారులు కూడా ఏ దస్త్రాన్ని తగులబెట్టేందుకు ఆదేశాలు ఇచ్చినా ముందుగా వాటిని స్కాన్ చేసి కంప్యూటర్లలో సేవ్ చేసుకున్న తర్వాతే కింది స్దాయి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని సీఎస్ సూచించారు. ఇలాంటి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications