ఏపీలో పోస్టాఫీసులకు జనం క్యూ...కారణమిదే !
ఏపీలో పోస్టాఫీసులకు కొద్ది రోజులుగా జనం తాకిడి పెరుగుతోంది. అదీ కొత్త ఖాతాలు తెరిచేందుకు జనం క్యూ కడుతున్నారు. క్రమంగా ఈ రద్దీ పెరుగుతోంది. దీంతో బ్యాంకుల హవాతో కళ తప్పిన పోస్టాఫీసులు కళకళలాడుతున్నాయి. అంతే కాదు పోస్టాఫీసుల్లో కొత్త ఖాతాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇంతకీ ఏం జరుగుతుందని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. ప్రభుత్వం ఇచ్చిన ఓ సంకేతం ఇలా పోస్టాఫీసులకు జనం క్యూ కట్టడానికి కారణమైందని తెలుస్తోంది.

ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ చెప్పుకోదగిన స్ధాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలెండర్లు మినహా మిగతా పథకాల ఊసెత్తడం లేదు. దీంతో ప్రభుత్వంపై పథకాల అమలుపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో ఒక్కొక్కటిగా పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇదే క్రమంలో బ్యాంకుల్లో ఖాతాలు లేని వారు, ఉన్నా ఆధార్ తో లింక్ కాని వారు పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరవాలని ఓ హింట్ ఇచ్చింది. ఇలాంటి వారు కేవలం లక్ష మంది మాత్రమే ఉన్నారు.
దీంతో జనం పోస్టాఫీసులకు పరుగులు తీస్తున్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పటికే పోస్టాఫీసుల్లో ఖాతాలున్న వారు, బ్యాంకుల్లో ఖాతాలు ఉండి పథకాలు తీసుకుంటున్న వారు సైతం ఈ పుకార్లతో పోస్టాఫీసులకు క్యూ కడుతున్నారు. వాస్తవానికి బ్యాంకులో ఖాతా లేని వారు, ఉండి కూడా ఆదార్ తో లింక్ కాని వారు మాత్రమే పోస్టాఫీసుల్లో ఖాతా తెరవాల్సి ఉంటుంది. అలాగే పోస్టాఫీసులో అకౌంట్ ఉన్న వారు వాటికి నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ (ఎన్సీపీఐ)తో లింక్ కాకపోతే మాత్రమే పోస్టాఫీసులకు వెళ్లి లింక్ చేయించుకోవాలి. కానీ ఇవేం తెలియక సంక్షేమ పథకాలు ఎక్కడ కోల్పోతామో అన్న ఆందోళనతో జనం పోస్టాఫీసులకు పరుగులు తీస్తున్నారు.












Click it and Unblock the Notifications