నిమ్మగడ్డ చార్ దిన్ కా సుల్తాన్.. పదవీ విరమణ తర్వాత బతుకు బజారే : ఎస్ఈసీపై ప్రభుత్వ విప్
పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతున్నకొద్ది ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు,ప్రభుత్వానికి మధ్య వైరం అంతకంతకూ ముదురుతోంది. అధికారులు మొదలు ప్రభుత్వ సలహాదారుల వరకు పలువురిపై చర్యలకు నిమ్మగడ్డ సీఎస్‌కు వరుస లేఖలు రాయడం... అసలు నిమ్మగడ్డ ఆ పోస్టుకు పనికిరారని వైసీపీ నేతలు విమర్శిస్తుండటం.. ఇలా ఇరువురి మధ్య రోజురోజుకు మాటల యుద్దం ముదురుతూనే ఉంది. తాజాగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి నిమ్మగడ్డ రమేష్‌పై విమర్శలు గుప్పించారు.

బతుకు బజారే... నిమ్మగడ్డపై తీవ్ర వ్యాఖ్యలు...
నిమ్మగడ్డ రమేష్ చార్ దిన్ కా సుల్తాన్ అని రామచంద్రారెడ్డి ఎద్దేవ చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వ అధికారులను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అధికారుల అంతు చూస్తాం, కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవీ విరమణ అనంతరం నిమ్మగడ్డ బతుకు బజారు పాలేనని విమర్శించారు. నిమ్మగడ్డ ఆ పదవి నుంచి దిగిపోయాక ఆయన్ను ఎవరూ పట్టించుకోరని విమర్శించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసినా ప్రభుత్వం అంగీకరించదని చెప్పారు.

నిమ్మగడ్డపై మూకుమ్మడి దాడి...
నిమ్మగడ్డపై శుక్రవారం(జనవరి 29) అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 'తక్షణమే జగన్మోహనరెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తొలగించి, ఆ స్థానంలో చంద్రబాబుని నియమించవలసిందిగా నిమ్మగడ్డ గవర్నర్‌కి లెటర్ రాసినా ఆశ్చర్యపోకండి. పిచ్చిముదిరింది...' అంటూ అంబటి రాంబాబు ట్విట్టర్‌లో ఆయన్ను విమర్శించారు. అంతకుముందు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నిమ్మగడ్డపై ఫైర్ అయ్యారు. ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాజకీయ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.టీడీపీ అధినేత చంద్రబాబు ఏజెంట్‌లా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను నిమ్మగడ్డ నమ్మకపోతే ఎలా అని ప్రశ్నించారు.

పదవీ కాలాన్ని పొడగించుకునే యోచనలో...
నిమ్మగడ్డ పదవీ కాలం ఈ మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆయన్ను చార్ దిన్ కా సుల్తాన్ అని ఎద్దేవా చేశారు. అయితే నిమ్మగడ్డ మాత్రం ప్రభుత్వానికి షాకిచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది ప్రభుత్వం హడావుడిగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి తనను పదవీ బాధ్యతల నుంచి తప్పించడంతో అప్పట్లో రెండు నెలల పదవీ కాలాన్ని కోల్పోయిన విషయాన్ని నిమ్మగడ్డ గుర్తుచేసుకుంటున్నారు. ఆ పదవీ కాలాన్ని తిరిగి పొందే ప్రయత్నం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన గవర్నర్‌ను కలవనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేనిపక్షంలో హైకోర్టును ఆశ్రయించైనా సరే ఆ రెండు నెలల పదవీ కాలాన్ని తిరిగి పొందాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలను కూడా ఆయన పూర్తి చేసే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications