చాగంటి సేవల కొనసాగింపు పై చంద్రబాబు తాజా నిర్ణయం..!!
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సేవల విషయంలో సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కేబినెట్ హోదాతో చాగంటికి విద్యార్థులు-నైతికత విలువల సలహాదారు పదవి ఖరారు చేసారు. ఈ నిర్ణయం తరువాత చంద్రబాబు, లోకేష్ ను కలిసిన చాగంటి ప్రభుత్వం ఖరారు చేసిన బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తాజాగా మంత్రివర్గ భేటీలో జరిగిన చర్చ మేరకు చాగంటికి ప్రభుత్వం మరో కీలక బాధ్యత కేటాయించింది.
చాగంటికి మరో బాధ్యత
ఏపీ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల ఖరారు వేళ చాగంటి కోటేశ్వర రావుకు కేబినెట్ హోదాలో కీలక బాధ్యతలు అప్పగించింది. జగన్ హయాంలోనూ చాగంటికి పదవి కేటాయించినా.. ఆ టైం లో ఆయన స్వీకరణకు ముందుకు రాలేదు. కానీ, కొద్ది రోజుల క్రితం చంద్రబాబు, లోకేష్ తో చాగంటి సుదీర్ఘ భేటీ జరిగింది. తాను ప్రభుత్వం కేటాయించిన బాధ్యతల స్వీకరణకు సిద్దంగా ఉన్నట్లు చాగంటి వెల్లడించారు. విద్యార్ధులకు మంచి మార్గంలో నడిపంచేలా నైతిక విలువలను బోధించే లా తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చారు.

మంత్రివర్గంలో చర్చ
పదవుల కోసం ఒప్పుకోలేదని.. తన మాటలతో పిల్లలకు మేలు జరిగితే చాలనే ఉద్దేశంతోనే అంగీకరించానని పేర్కొన్నారు. కాగా, ఇప్పుడు మరో బాధ్యత అప్పగించేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సలహాదారు హోదా లో ఉన్న చాగంటి కోటేశ్వరరావుతో ప్రత్యేకంగా పుస్తకాలు తయారు చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. తాజాగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో విద్యాశాఖ పైన చర్చ వేళ ఈ ప్రతిపాదన వచ్చింది.
విద్యార్ధులకు పంపిణీ
దీంతో, చాగంటితో పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ఈ పుస్తకాలను రూపొందించి పంపిణీ చేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు మంత్రివర్గ భేటీలోనే నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో కేజీ నుంచి పీజీ దాకా స్టూడెంట్స్‌కు విలువలతో కూడిన పాఠ్యప్రణాళిక తయారు చేయాలనే మరో నిర్ణయం కు ఆమోద ముద్ర వేసారు. సర్కారు బడుల్లో చదివే వారికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్కీమ్ కింద అందించే కిట్లలో భాగంగా ఈ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు.












Click it and Unblock the Notifications