మా నిర్ణయం నచ్చకుంటే ప్రజలే తేలుస్తారు - పవన్ కోరిక నెరవేరదు : సజ్జల..!!
Sajjala:అమరావతి పై హైకోర్టు ఆదేశాలపైన సుప్రీం స్టే ఇవ్వటం పై ప్రభుత్వ సలహాదారు సజ్జల స్పందించారు. ప్రజలకు సహజన్యాయం..వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని సజ్జల వివరించారు. మూడు రాజధానుల పైన హైకోర్టు ఆదేశాలు అందుకు భిన్నంగా ఉన్నాయని, ఇప్పుడు సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ప్రజల తీర్పు ద్వారా సంక్రమించిన అధికారం ఉందని వివరించారు. దానికి భిన్నంగా హైకోర్టు తీర్పు ఉందని సుప్రీం కోర్టు భావించిందని చెప్పారు. పాలసీ విధానాల్లో తప్పులు ఉంటే వాటిలో జోక్యం చేసుకొనే అధికారం కోర్టులకు ఎప్పటికీ ఉంటుందన్నారు.
ప్రభుత్వ విధానం తప్పోపులని నిర్ణయంచాల్సింది ప్రజలేనని వ్యాఖ్యానించారు. ఒకే రాజధాని ఉండాలి, అక్కడే అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకొని ఉంటే గత ఎన్నికల ఫలితాల్లో ఆ అంశం కనిపించేదన్నారు. అమరావతి లోనే చంద్రబాబు నిర్ణయానికి మద్దతు లభించలేదని..అందుకే జనం తిరస్కరించారని సజ్జల చెప్పుకొచ్చారు. గ్రాఫిక్స్ తో ప్రజలను మభ్యపెట్టలేరని తేలిపోయిందన్నారు. జగన్ మూడు రాజధానులు చట్టం చేసిన తరువాత రాష్ట్రంలో వరుసగా జరిగిన అన్ని ఎన్నికల్లో జనం మద్దతుగా నిలిచారని సజ్జల వివరించారు. డిసెంబర్ 5న కర్నూలులో మూడు రాజధానులకు మద్దతుగా భారీ సభకు నిర్ణయించారు.

ఈ సమయంలోనే సుప్రీం స్టే ఆదేశాలు ఇవ్వటం ఆహ్వానిందగ్గ పరిణామంగా పేర్కొన్నారు. న్యాయరాజధాని ఏర్పాటుకు ఉన్న చిన్న చిన్న అడ్డంకులు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రభుత్వ విధి విధానాలపై ప్రజాకోర్టులో ప్రజల తీర్పు ఉంటుందని వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు స్టే మొట్టికాయ లాంటిదని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం ప్రజలకు నచ్చకుంటే ప్రజలే తీర్పు ఇస్తారని సజ్జల పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం న్యాయమైన నిర్ణయం తీసుకుందన్నారు. వీకేంద్రీకరణ ద్వారా రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందన్నారు. చంద్రబాబును అర్జంటుగా సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలనేది పవన్ కల్యాణ్ తక్షణ కోరిగా సజ్జల చెప్పారు. ప్రజలు పవన్ కోరిక ను అంగీకరించడం లేదన్నారు. పవన్ తాను సీఎం అవ్వటం కోసం ప్రయత్నం చేయటం లేదని..చంద్రబాబును చేయటం కోసమే పని చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ ను ఓడించాలనే పవన్ లక్ష్యం నెరవేదని సజ్జల పేర్కొన్నారు.