Air India: ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన భారీ ప్రమాదం
ఎయిర్ ఇండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ సమయంలో టెయిల్ స్ట్రైక్ కు గురైంది. అంటే విమానం వెనుకభాగం బలంగా నేలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదం జరిగినప్పటికీ పైలట్ సమయస్ఫూర్తితో విమానాన్ని రన్ వేపై సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు. దాంతో విమానంలోని ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. వాళ్లను సురక్షితంగా కిందకు దింపారు. ఎయిర్ ఇండియా విమానం AI2652 దిల్లీ నుంచి బెంగళూరుకు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అయితే సమగ్ర విచారణ కోసం విమానాన్ని కెంపెగౌడ ఎయిర్ పోర్టులోనే నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి ప్రకటన చేశారు.
ఘటనా సమయంలో AI2652 ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 179 మంది ఉన్నారు. అయితే వారంతా సురక్షితంగానే ఉన్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు స్పష్టం చేశారు. ఇక ఈ ఘటనపై ఎయిర్ ఇండియా స్పందించింది. నిర్దేశిత నిబంధనల ప్రకారం.. సంబంధిత నియంత్రణ సంస్థల సమన్వయంతో దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.
ఇక గతేడాది జూన్ 12 న ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే నియంత్రణ కోల్పోయి బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాలపై కుప్పకూలింది. విమానంలో ఉన్న 241 మందితో పాటు హాస్టల్ లోని 19 మంది ఇలా మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక్క ప్రయాణికుడు మాత్రమే ఈ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

అలాగే 2010 లోనూ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. 2010 మే 22 న దుబాయ్ నుంచి వచ్చిన బోయింగ్ 737 విమానం మంగళూరు విమానాశ్రయంలోని టేబుల్ టాప్ రన్ వే పై ల్యాండింగ్ అవుతుండగా రన్ వే దాటి ముందుకు వెళ్లి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 166 మందిలో 158 మంది మరణించారు.












Click it and Unblock the Notifications