SBI వినియోగదారులకు అలర్ట్: వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఖాతాదారులకు అత్యవసర అలర్ట్. బ్యాంకుకు స్వయంగా వెళ్లి చేసుకోవాల్సిన పనులు ఏవైనా ఉంటే వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవడం మంచిది. ఎందుకంటే మే 23, 2026 శనివారం నుంచి మే 28 గురువారం వరకు వరుసగా ఆరు రోజుల పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఎస్బీఐ బ్రాంచ్‌లు మూతపడే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి దేశవ్యాప్తంగా ఎస్బీఐ బ్యాంకింగ్ సేవలకు వరుసగా 6 రోజుల పాటు అంతరాయం కలగనుంది. బ్యాంకు పనులు ఉన్నవారు రేపటి లోపు పూర్తి చేసుకోవడం మంచిది. వారాంతపు సెలవులు, ఉద్యోగుల రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె, బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ సెలవుల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది.
బ్యాంకుల సెలవుల వివరాలను పరిశీలిస్తే.. మే 23న నాలుగో శనివారం, మే 24న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు ఎలాగూ పనిచేయవు. ఆ తర్వాత వచ్చే సోమ, మంగళవారాల్లో (మే 25, 26) కూడా బ్యాంకింగ్ సేవలకు భారీ విఘాతం కలగనుంది. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (AISBISF) తమ వివిధ డిమాండ్ల సాధన కోసం ఈ రెండు రోజులు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెకు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA) కూడా మద్దతు ప్రకటించింది. బ్యాంకులో ఖాళీల భర్తీ, సాయుధ సెక్యూరిటీ గార్డుల నియామకం, ఔట్సోర్సింగ్ విధానాన్ని వ్యతిరేకించడం, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పరిధిలో ఉద్యోగులకు నచ్చిన ఫండ్ మేనేజర్‌ను ఎంచుకునే అవకాశం కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో ఈ సమ్మె జరుగుతోంది.

సమ్మె ముగిసిన వెంటనే మే 27, 28 తేదీల్లో బక్రీద్ పండుగ సెలవులు రానున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సెలవుల క్యాలెండర్ ప్రకారం.. భారతదేశంలోని మెజారిటీ రాష్ట్రాలలో మే 27న బక్రీద్ కారణంగా ఎస్బీఐతో పాటు అన్ని బ్యాంకులు మూతపడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మే 28న ఈ సెలవు వర్తించనుంది. కాగా జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో మాత్రం మే 27, 28 రెండు రోజుల పాటు వరుసగా బ్యాంకులు బంద్ కానున్నాయి.
ఈ విధంగా వీకెండ్, సమ్మె, పండుగ సెలవులు అన్నీ ఒకేసారి వరుసగా రావడంతో మే 23 నుంచి 28 వరకు ఆరు రోజుల పాటు ఎస్బీఐ బ్రాంచ్‌లలో భౌతిక సేవలు నిలిచిపోనున్నాయి. అయితే బ్రాంచ్‌లు మూతపడినప్పటికీ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎస్బీఐ ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ సేవలు, యూపీఐ లావాదేవీలు, ఏటీఎం నగదు సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా యథావిధిగా పనిచేస్తాయని బ్యాంక్ వర్గాలు స్పష్టం చేశాయి.












Click it and Unblock the Notifications