విజయవాడ దుర్గగుడిలో కరెంటు కట్ వెనుక? సర్కార్ క్లారిటీ..!
ఏపీలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటైన విజయవాడ కనకదుర్గ ఆలయంలో తాజాగా కరెంటు కోత జరిగింది. నిత్యం వెలుగులతో నిండిపోయి కనిపించే దుర్గగుడిలో సడన్ గా కరెంటు పోవడంతో భక్తులు, అధికారులు, సిబ్బంది అంతా షాకయ్యారు. కారణమేంటని తెలుసుకుంటే దుర్గగుడికి సకాలంలో కరెంటు బిల్లులు చెల్లించలేదని తేలింది. దీంతో వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి కరెంటు పునరుద్ధరించారు. అయితే ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
విజయవాడలో ఎంతో చరిత్ర కలిగిన, ఆదాయం కూడా కలిగిన దుర్గమ్మ గుడిలో కరెంటు కట్ చేయడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని విపక్షాలు మండిపడ్డాయి. భక్తుల మనోభావాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని విమర్శలు గుప్పించాయి. దీంతో తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో సైతం సీఎం చంద్రబాబు దీనిపై స్పందించారు. విపక్షాలు ఇలాంటి విషయాల్ని రాజకీయం చేస్తుంటే మంత్రులు ఏం చేస్తున్నారంటూ క్లాస్ కూడా పీకారు. దీంతో ఇవాళ విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు.

విజయవాడ దుర్గగుడిలో కరెంటు నిలిచిపోయిన వ్యవహారం వాస్తవమేనని మంత్రి గొట్టిపాటి రవి అంగీకరించారు. అయితే ఇది కేవలం 15-20 నిమిషాల పాటు మాత్రమే జరిగిందని, ఆ తర్వాత అధికారులు స్పందించి కరెంటును పునరుద్ధరించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై తక్షణం విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్ల తెలిపారు. బాధ్యుల్ని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే విద్యుత్, దేవాదాయశాఖ అధికారులతో మాట్లాడినట్లు మంత్రి తెలిపారు. వచ్చే నెలలో మరోసారి దేవాదాయశాఖ అధికారులతో మాట్లాడి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. దీనిపై విపక్షాలు రాజకీయం చేయడం తగదన్నారు. చిన్న సమన్వయ లోపం వల్ల జరిగిన ఘటనకు బాధ్యుల్ని శిక్షిస్తామని మంత్రి మరోసారి తెలిపారు.












Click it and Unblock the Notifications