కూటమి ప్రభుత్వం 28 నెలల్లో 434 రహస్య జీవోలు.. వైఎస్సార్సీపీ ప్రశ్నలు!
అధికారంలోకి వస్తే పారదర్శక పాలన అందిస్తామని ఎన్నికల్లో గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లు ప్రభుత్వం ఏర్పాటైన 28 నెలల కాలంలోనే 434 రహస్య జీవోలు జారీ చేశారని వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు
ప్రజలకు తెలియకుండా ఇంత పెద్ద సంఖ్యలో రహస్య జీవోలు ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది? ఈ జీవోల్లో ఏముంది? ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన నిర్ణయాలను ఎందుకు దాస్తున్నారు? అని కారుమూరి సూటిగా అడిగారు. 2024 జూలై 25న హోం శాఖ నుంచి తొలి రహస్య జీవో వచ్చిందని, 2026 అక్టోబర్ 9 నాటికి మొత్తం 434కు చేరుకున్నాయని ఆయన ఆరోపించారు.

సెప్టెంబర్‌లో 15, అక్టోబర్ 12 నాటికి ఈ నెల వ్యవధిలోనే 11 రహస్య జీవోలు వెలువడ్డాయని, దాదాపు ప్రతి రెండు రోజులకు ఒకటి చొప్పున జారీ అవుతున్నాయని పేర్కొన్నారు.శాఖల వారీగా చూస్తే రెవెన్యూ శాఖలో అత్యధికంగా 181, హోం శాఖలో 83, ఆర్థిక శాఖలో 24, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 18 రహస్య జీవోలు ఉన్నాయని కారుమూరి చెప్పారు.
రెవెన్యూ శాఖ అంటే భూములు, ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే శాఖ. అలాంటి శాఖలో ఇన్ని జీవోలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు సంబంధించినవి కూడా రహస్యంగా ఉంచారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం 2014-2019 మధ్య కాలంలోనూ 1,729 కాన్ఫిడెన్షియల్ జీవోలు జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు.
చంద్రబాబు ప్రభుత్వం ఈ రహస్య జీవోల ద్వారా కన్సల్టెంట్ల నియామకాలు, ప్రత్యేక కేటాయింపులు, భూముల కేటాయింపుల్లో అనుచిత ప్రయోజనాలు కల్పించారా అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోతే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ప్రతి జీవో వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీస్తామని హెచ్చరించారు.
2024 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియపై కూడా అనుమానాలు ఉన్నాయని కారుమూరి చెప్పారు. తమ అనుమానాలపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌ను పార్టీ సమర్థిస్తోందని తెలిపారు. వైఎస్సార్సీపీ ఏ కూటమిలోనూ లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు జవాబుదారీగా పాలన సాగించాలని, రహస్యాలు దాచకుండా నిర్ణయాలను అందుబాటులో ఉంచాలని కారుమూరి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
