అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!!
అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతికి చట్టబద్దత దిశ గా కేంద్రం ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదం తెలపనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం ఆమోదించి.. కేంద్రానికి పంపనుంది. ఇదే సమయంలో నిర్మాణాల వేగం పెంచే విధంగా కసరత్తు జరుగుతోంది. కాగా.. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతను సింగపూర్‌కి చెందిన సుర్బానా జురాంగ్ సంస్థకు సీఆర్డీఏ అప్పగించింది.
అమరావతిలో నిర్మాణాల ప్రక్రియ ఊపందుకుంది. రాజధాని రెండో దశ మాస్టర్ ప్లాన్ రూప కల్పన బాధ్యతను సింగపూర్ కు చెందిన సుర్భానా జురాంగ్ సంస్థకు సీఆర్డీఏ అప్పగించింది. రాజధాని 2వ దశ ఆర్థిక ప్రణాళిక బాధ్యతను నైట్ ఫ్రాంక్ కన్సల్టెన్సీకి అప్పగించింది. 6 నెలల్లో 2వ దశ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఆర్డీఏ గడువు విధించింది. ఇటీవలే ఈ మేరకు సీఆర్డీఏ గ్లోబల్ టెండర్లను పిలిచింది. అందులో భాగంగా తాజాగా బాధ్యతలను ఖరారు చేసింది. మౌలిక వసతుల రూపకల్పన బాధ్యతలు ఆర్వీ అసోసియేట్స్ కు కేటాయించింది. రాజధాని తొలి దశకు మాస్టర్ ప్లాన్‌ను సుర్బానా జురాంగ్, తొలి దశ మౌలిక వసతుల ప్రణాళికను ఆర్వీ అసోసియేట్స్ సంస్థలే రూపకల్పన చేసి ప్రభుత్వానికి అందించాయి. అమరావతి పరిస్థితుల పై ఆ 2 సంస్థలకు కూడా పూర్తి అవగాహన ఉండటంతో.. తిరిగి వారికే తాజా బాధ్యతలను అప్పగించారు. రాజధాని తొలి దశలో రాజధాని అమరావతికి 217 చదరపు కి.మీ. ప్రాంతానికి సుర్బానా జురాంగ్ సంస్థ మాస్టర్ ప్లాన్ రూపొందించింది.

అమరావతి వేదికగా కీలక నిర్ణయాలు
కాగా, అమరావతి విస్తరణ ప్రణాళికలో భాగంగా 2వ దశలో మొత్తం 709 చదరపు కి.మీ. ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఈ పరిధిలో మొత్తం 50 గ్రామాలు ఉన్నాయి. వాటిలో కేవలం 7 గ్రామాల్లో ఇప్పటికే భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. 7 గ్రామాల్లో ప్రభుత్వ, దేవాదాయ భూములు, చెరువులు, కుంటలు వంటివి అన్నీ కలిపి మొత్తం 20,494 ఎకరాలు ఉన్నాయి. మిగతా 43 గ్రామాల్లో 1,54,853 ఎకరాల విస్తీర్ణం ఉంది. రాజధాని ప్రాంతంలో 30 శాతం పైగా ప్రాంతంలో హరిత వనాలు, జలాశయాలు, కాలువులు కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాజధాని విస్తరణకు అవసరం అయ్యే మూలధన వ్యయం, దానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ ప్రణాళికను రూపొందించే బాధ్యతను నైట్ ఫ్రాంక్ సంస్థకు అప్పగించారు. సీఆర్డీఏకి వచ్చే భూముల్ని విక్రయించడం, జాయింట్ డెవలప్మెంట్, దీర్ఘకాలిక లీజు వంటి నమూనాల ద్వారా ఆర్థిక వనరుల సమీకరణకు ఈ సంస్థ ప్రణాళికలను ప్రభుత్వానికి అందించనుంది.












Click it and Unblock the Notifications