రాజధాని గ్రామాల్లో స్టాంప్ డ్యూటీ రూ. 100: 'రైతులకు ప్లాట్లు అక్కడే ఇస్తాం'
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో భవన నిర్మాణం చేపట్టబోయే ప్రైవేట్ సంస్ధలకు ఏపీ ప్రభుత్వం వరాలను ప్రకటించింది. రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రైవేట్ సంస్ధలతో చేసుకునే ఒప్పందాలకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీని రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది.
రాజధాని గ్రామాల్లో నిర్మాణాల కోసం చేసుకునే ఒప్పందాలకు స్టాంప్ డ్యూటీ కేవలం రూ. 100 వసూలు చేసేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఒప్పందాలు కదుర్చుకోవడం లాంటి నిర్మాణ రంగానికి సంబంధించిన పనులను సులభతరం చేయడం వల్ల ప్రైవేటు సంస్థలను ఎక్కువగా ఆకర్షించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
దీంతో ఇకపై సీఆర్డీఏ చేసుకునే ఒక్కో ఒప్పందానికి రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది. అంతేకాదు రాజధాని గ్రామాల్లో నిర్మాణాల కోసం చేసుకునే ఒప్పందాలపై రిజిస్ర్టేషన్, టేబుల్ ఫీజులను కూడా ఏపీ ప్రభుత్వం మినహాయించింది. ఇప్పటికే వెలగపూడి గ్రామంలో తాత్కాలిక సచివాలయాన్ని ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

అంతేకాదు ఇందుకు సంబంధించి టెండర్లను సైతం ఆహ్వానించింది. తాత్కాలిక సచివాలయాన్ని అతి తక్కువ కాలంలో పూర్తి చేసేలా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు రైతులకిచ్చే ప్లాట్లపై ఏపీ ప్రభుత్వం ఒక స్పష్టతకు రాకపోవడంతో కాస్తంత ఇబ్బందిగా మారింది.
దీనిపై సీఆర్డీఏ కమిషనర్ మాట్లాడుతూ రాజధాని కోసం జరీబు భూములిచ్చిన రైతులకు వారి ప్లాట్లు జరీబు భూముల్లోనే ఇస్తామని తెలిపారు. ఉద్ధండ్రాయునిపాలెంలోని పంచాయతీ కార్యాలయంలో ఆదివారం లింగాయపాలెం, మందడం, వెంకటపాలెం, ఉద్ధండ్రాయునిపాలెం రైతులతో ఆయన సమావేశం నిర్వహించారు.
తమకు ఇచ్చే పాట్లు ఎక్కడో తెలియటం లేదంటూ ఈ నెల 13న అవగాహన సదస్సును రైతులు బహిష్కరించిన సంగతి తెలిసిందే. సీఆర్‌డీఏ కమిషనర్ వస్తేనే అవగాహనా సదస్సు జరుగుతుందని రైతులు ఆరోజు చెప్పడంతో ఆదివారం ఉద్ధండ్రాయునిపాలెంలో రైతులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు.












Click it and Unblock the Notifications