ఏపీ రాజధానిలో తొలి ఘటన: అనుమతిలేని కట్టడం కూల్చివేత..!
గుంటూరు: ఏపీ రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలోని 29 గ్రామాల పరిధిలో అనుమతిలేని కట్టడాలు నిర్మిస్తే కూల్చివేస్తామని సిఆర్‌డిఎ అధికారులు అనేకసార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఓ భవనాన్ని కూల్చివేసిన ఘటన శనివారం తొలిసారిగా చోటు చేసుకుంది.
తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ పరిధిలో గల ఉండవల్లి గుహల వద్ద భక్తుల సౌకర్యార్థం అంటూ ఓ షెడ్‌ను స్థల యజమానులు నిర్మించారు. భూ సమీకరణ చట్టం ప్రకారం నోటిఫికేషన్ జారీచేసిన పరిధిలో ఈ స్థలం ఉంది. భూ సమీకరణకు ఇంతవరకు యజమాని స్థలాన్ని ఇవ్వలేదు.
అంతేకాకుండా స్థలంలో మొక్కుబడి భక్తులు పొంగళ్లు చేసుకునేందుకు అనువుగా ఈ షెడ్‌ను నిర్మించారు. యజమాని సిగిరిశెట్టి శ్రీనివాసరావు షెడ్‌ను నిర్మించిన విషయాన్ని సిఆర్‌డిఎ అధికారులు గుర్తించి 15 రోజుల క్రితం నోటీసులు జారీచేశారు. అయితే సదరు యజమాని స్పందించకపోవడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు.

శనివారం నిర్మాణంలో ఉన్నషెడ్‌ను కూల్చివేశారు. పోలీసుల బందోబస్తు మధ్య ఈ కట్టడాన్ని అధికారులు దగ్గరుండి కూల్చివేశారని యజమాని తెలిపారు. అయితే సిఆర్‌డిఎ అధికారులు గతంలోనే పూలింగ్ పరిధిలో ఉన్న భూముల్లో ఎటువంటి కట్టడాలను అనుమతించేది లేదని అనేకసార్లు ప్రకటించారు.
సిఆర్‌డిఎ పరిధిలోని 29 గ్రామాల్లో గల అక్రమ రియల్‌ఎస్టేట్ వెంచర్లను గుర్తించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాలతో పాటు అమరావతి, తాడికొండ ప్రాంతాల్లో గల రియల్ ఎస్టేట్ వెంచర్లను తొలగించాలని మంత్రులు ఇప్పటికే కోరారు.
తాడేపల్లి మండలంలో పెనుమాక, ఉండవల్లి గ్రామాల రైతులు భూ సమీకరణను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు గ్రామాల్లో ఎకరం భూమి ధర 3 నుంచి 4 కోట్ల వరకు పలుకుతోంది.












Click it and Unblock the Notifications