అనధికార లేఅవుట్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!
ఏపీలో అనధికార లేఅవుట్లపై ప్రభుత్వం (ap govt) మరో కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు గతంలో ఇచ్చిన గడువును మరోసారి పొడిగించింది. దీంతో అనధికార లేఅవుట్లు కలిగిన వారు తమ స్థలాల్ని ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం చెల్లించి క్రమబద్ధీకరణ చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఎలాంటి ఆటంకాలు లేకుండా వాటిని క్రయవిక్రయాలు చేసుకునేందుకు వీలుంటుంది. లేకపోతే ప్రభుత్వ చర్యలకు గురికావాల్సి వస్తుంది.
రాష్ట్రంలో అనధికార లేఅవుట్లను క్రమబద్గీరించుకునేందుకు ఇచ్చిన గడువును ఈ ఏడాది ఏప్రిల్ 23 వరకూ పొడిగిస్తూ మున్సిపల్ శాఖ ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ కుమార్ ఓ ప్రకటన చేశారు. ఈ లోపు అక్రమ లేఅవుట్లలో ఉంటున్న వారు క్రమబద్ధీకరించుకోవాలని ఆయన కోరారు. ఎల్ఆర్ఎస్ పథకం కింద అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలనుకునే వారు రూ.10,000 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.

రాష్ట్రంలో ఇప్పటికే గతేడాది ప్రకటించిన ఎల్ఆర్ఎస్ పథకం కింద 61,947 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. వీటిని వరుసగా ప్రాసెస్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ అనధికార లేఅవుట్ల క్రమబద్ఘీకరణ ప్రక్రియలో మధ్యవర్తులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ శాఖ అధికారులు హెచ్చరించారు. కాబట్టి ప్రజలు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పారదర్శకంగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications