కేంద్రం పరిశీలన: సీమాంధ్ర రాజధాని ఎక్కడ?
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం సీమాంధ్ర రాజధాని ఏ ప్రాంతం అయితే బాగుంటుందనే అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుత రాజధాని హైదరాబాద్ ఇరు ప్రాంతాలకు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందె. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా సీమాంధ్ర రాష్ట్రంలో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా రాజధాని ఏర్పాటు చేయాలంటే సీమాంధ్ర ప్రాంతంలో ఒకే చోట ఖాళీగా ఉన్న సుమారు లక్ష ఎకరాల స్థలం కావాల్సి ఉంటుంది. ఇలాంటి స్థలం ఏ ప్రాంతంలో ఉంటుందో ఆ ప్రాంతానికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. స్థలంతోపాటు తాగు నీటి వనరులు కూడా అందుబాటులో ఉన్న ప్రాంతాలను కేంద్రం ఇప్పటికే పరిశీలించినట్లు సమాచారం. రాజధాని కోసం ప్రజలను తమ నివాసాల నుంచి ఖాళీ చేస్తే వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉందని రాష్ట్రం ప్రభుత్వం కేంద్రానికి తెలిపినట్లు సమాచారం.

ప్రైవేటు వ్యక్తుల స్థలాలను సేకరించి రాజధానిని నిర్మించడం కంటే అటవీ ప్రాంతాన్ని డి నోటిఫై చేసి ఆ స్థలంలో నిర్మించుకుంటే తక్కువ ఖర్చులో పూర్తవుతుందన్న అభిప్రాయాన్ని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం రాజధాని నిర్మాణంలో పచ్చదనం కూడా అవసరం ఉన్నందున అటవీ ప్రాంతాన్ని డి నోటిఫై చేసి అందులో కొంత భాగాన్ని రాజధాని నిర్మాణం కోసం వినియోగించి, మరికొంత భాగాన్ని అలాగే వదిలేస్తే పచ్చదనం కూడా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌పై తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో అలాంటి సందర్భంగా భవిష్యత్‌లో ఆంధ్ర, రాయలసీమ ప్రజల మధ్య తలెత్తకుండా ఉండాలంటే సరైన ప్రదేశంలో రాజధానిని నిర్మించాలని కేంద్రం ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీమాంధ్రలోని మూడు ప్రాంతాలను పరిశీలించినట్లు సమాచారం. సీమాంధ్ర రాజధాని ఫలానా స్థలం అని చెప్పకుండానే అందుకు అవసరమైన అన్ని అనుకూలతలు కలిగిన ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసినట్లు తెలిసింది.
అయితే రాజధాని నిర్మాణానికి కావాల్సిన ముఖ్యమైన అంశాలు భూమి, నీటి వనరుల లభ్యత. ప్రస్తుతం హైదరాబాద్ లక్షన్నర ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉందని, సీమాంధ్ర రాజధాని నిర్మాణానికి కనీసం లక్ష ఎకరాల స్థలం కావాల్సి ఉందని కేంద్రానికి రాష్ట్రం సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఒకే చోట లక్ష ఎకరాల ఖాళీ స్థలం ఉండాలని, ఆ ప్రాంతంలోనే సీమాంధ్ర రాజధానిని నిర్మించాలని రాష్ట్రం ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తోంది.
కాగా రాజధాని నిర్మాణానికి అవకాశాలున్న మూడు ప్రాంతాలను కేంద్రం ఇప్పటికే పరిశీలించినట్లు సమాచారం. కర్నూలు-ప్రకాశం మధ్య ఉన్న అటవీ ప్రాంతాన్ని డి నోటిఫై చేసి అక్కడ సీమాంధ్ర రాజధాని నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాంతం ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు దగ్గరగా ఉండడంతో ఇరు ప్రాంత ప్రజల నుంచి పెద్ద వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు.
మరో ప్రాంతం గుంటూరు జిల్లాలోని కృష్ణా నది పరివాహక అటవీ ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ నిర్మిస్తే పులిచింతల నుంచి నీటిని తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలు కాకపోతే గోదావరి నది పరివాహక ప్రాంతంలో రాజధానిని నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆంధ్ర , రాయలసీమ ప్రాంతాల ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరం లేని ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.












Click it and Unblock the Notifications