జెత్వానీ కేసులో ఆ ఇద్దరు ఐపీఎస్ ల పై సస్పెన్షన్ ఎత్తివేత, రెండేళ్ల తరువాత పోస్టింగ్..!!
ఎట్టకేలకు ఆ ఇద్దరు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్స్ ఖరారయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత ముంబాయి మోడల్ జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పైన సస్పెన్షన్ వేటు పడింది. వీరి పైన కేసు విచారణ కొనసాగుతోంది. దీంతో.. వీరిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాగా, ఈ కేసులో కోర్టులో ఛార్జ్ షీటు దాఖలు చేయటంతో.. ఈ వీరిలో ఇద్దరు అధికారుల పైన సస్పెన్షన్ ఎత్తేవేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో వారిద్దరి పైన కొన్ని కీలక సూచనలు జారీ అయ్యాయి.
ముంబై నటి కాదంబరీ జెత్వాని కేసులో ఇద్దరు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో రెండేళ్ల కాలంగా సీనియర్ ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్ లో ఉన్నారు. ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ పైన సస్పెన్షన్ కొనసాగుతుండ గా .. ఈ రోజు ఆ సస్పెన్షన్ ఎత్తివేసారు. జెత్వానీ పై అక్రమ కేసు బనాయించి వేధించారంటూ ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ లో నమోదైన కేసులో నిందితులైన ఈ ఇద్దరిని 2024 సెప్టెంబర్ 15న ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న దశలో సస్పెన్షన్ ఎత్తివేస్తే సాక్ష్యులను ప్రభావితం చేయవచ్చని రివ్యూ కమిటీ అభిప్రాయం మేరకు అప్పటి నుంచి వారి సస్పెన్షన్ కొనసాగుతోంది. ఈ కేసులో సీఐడీ దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీటు దాఖలు చేసారు. దీంతో.. వీరి సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

రెండేళ్ల తరువాత తిరిగి విధుల్లోకి..
ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని (2010 బ్యాచ్), కాంతి రాణా టాటా (2004 బ్యాచ్)ని తక్షణమే విధుల్లోకి తీసుకుంటూ గురువారం సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీరి పైన చివరగా జారీ చేసిన సస్పెన్షన్ రేపు (శుక్రవారం) తో ముగియనుంది. దీంతో.. ఇద్దరు అధికారుల సస్పెన్షన్ ఎత్తివేతకు సంబంధించి డీజీపీ (హెచ్‌ఓపీఎఫ్) ఇచ్చిన నివేదికలను ప్రభుత్వం పరిశీలించింది. కాంతి రాణా టాటా ఆగస్టు 24న సమర్పించిన వినతిపత్రాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని నిర్ణయించింది. దీంతో విశాల్ గున్ని, కాంతి రాణా టాటాలను తక్షణమే విధుల్లోకి పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, వారిపై కొనసాగుతున్న క్రమశిక్షణ, క్రిమినల్ కేసులపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.













Click it and Unblock the Notifications