ఉచిత బస్సు అమలు వేళ ప్రభుత్వం దీపావళి బొనాంజా..!!
ఏపీ ప్రభుత్వం పండుగ వేళ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న నిర్ణయం వెలువరించింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తోంది. ఈ పథకం సక్సెస్ లో ఆర్టీసీ సిబ్బంది పాత్రను సీఎం చంద్రబాబు అభినందించారు. కాగా, ఉద్యోగులు తమ పదోన్నతుల పైన ప్రభుత్వంతో చర్చలు జరిపారు. తాజాగా సీఎం హామీ మేరకు నాలుగు కేడర్ల ఉద్యోగులకు ప్రమోషన్లతో పాటుగా..పనిష్‌మెంట్ల నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బందికి దీపావళి బొనాంజ ప్రకటించింది. ఆరేళ్లుగా ఉద్యోగులు ఎదురు చూస్తున్న పదోన్నతులకు లైన్ క్లియర్ అయింది. నాలుగు కేడర్ల ఉద్యోగులకు పదోన్నతుల అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చంద్రబాబు తాజా సమావేశం సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల ఫైల్ క్లియర్ చేస్తామని ప్రకటించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు ఇచ్చింది.

మెకానిక్‌లు, డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్జీజన్స్ కేడర్‌లలోని ఉద్యోగులు, పనిష్మెంట్లు, పెనాల్టీలు, క్రమశిక్షణ చర్యలు, ఛార్జెస్ ఉన్నప్పటికీ వాటితో సంబంధం లేకుండా పదోన్నతులు పొందేందుకు అర్హులుగా పేర్కొంది. అయితే వారంతా కూడా గతంలో ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్నప్పుడు ఈ విధమైన మినహాయింపు ఉండేది. తాజా ఉత్తర్వుల్లో వీరికి సంబంధించి స్పష్టత ఇచ్చింది.
ఇక, 2020లో ప్రభుత్వంలో విలీనం అయినప్పటి నుంచి ఇతర శాఖల ఉద్యోగుల నిబంధనలు వీరికీ వర్తించాయి. వాటి నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. బీ ఆర్టీసీలో ఆరు విభాగాలు ఉన్నాయి. అందులో ప్రస్తుతం రెండు విభాగాల్లోని సిబ్బందికే పదోన్నతులకు అవకాశం కల్పించగా..తాజాగా ఆరు విభాగాల్లోని ఉద్యోగులు అందరికీ పదోన్నతులు దక్కేలా చొరవ చూపాలని ఉద్యోగ సంఘాలు కోరాయి.
లేకపోతే చాలా మందికి అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ మేరకు ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న నాలుగు డీఏల్లో ఒకటి నవంబర్ 1న విడుదల చేస్తామని దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. అదే విధంగా ఆర్టీసీ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు పదోన్నతుల ఉత్తర్వులు జారీ అయ్యాయి.












Click it and Unblock the Notifications