అమరావతిపై సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం - టీడీపీకి ఇరకాటం..!!
అమరావతికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో అమరావతి భూముల అంశం పైన చర్చ జరిగింది. సీఆర్డీఏ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. అమరావతి పరిధిలో రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం చేసింది. రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి సమీకరించిన భూమిలో 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' పథకం కింద రాజధాని బయటి ప్రాంతాలకు చెందినవారికి ఇళ్లస్థలాలు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని గతంలో హైకోర్టు నిలిపివేసింది.

గతంలో కేటాయింపులు - ఆరోపణలు
టీడీపీ ఈ పిటీషన్ వేయించిందంటూ సీఎంతో సహా వైసీపీ నేతలు విమర్శలు చేసారు. పేదలకు స్థలాలు ఇస్తే అక్కడ సమతుల్యత దెబ్బ తింటుందని అఫిడవిట్ లో పేర్కొన్నారంటూ ప్రతిపక్షాలను టార్గెట్ చేసారు. ఇప్పుడు కేబినెట్ సమావేశంలో రాజధాని పర్స్పెక్టివ్ ప్లాన్, బృహత్తర ప్రణాళిక, మౌలిక వసతుల ప్రణాళికలో మార్పులు చేసుకునేందుకు వీలుకల్పిస్తూ సీఆర్‌డీఏ చట్టంలో ప్రతిపాదించిన సవరణలకు రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. 2014నాటి సీఆర్‌డీఏ చట్టంలోని 41(1), 41(3) సెక్షన్లను సవరించడంతో పాటు, కొత్తగా 41(6) సెక్షన్‌ను చేర్చింది. 2(22) సెక్షన్‌ను సవరించడంతోపాటు, కొత్తగా 53(1) సెక్షన్‌ను జతచేసింది. దీంతో రాజధానిలో అందుబాటు ధరలో గృహనిర్మాణ పథకానికి రాష్ట్రంలోని ఏ ప్రాంతంవారైనా అర్హులేనని, ఆ పథకం రాజధానిలోని 29 గ్రామాల ప్రజలకే పరిమితం కాదని ఆ సెక్షన్‌లో ప్రభుత్వం పొందుపరిచింది.

తాజాగా చట్ట సవరణకు ఆమోదం
రాజధానికి రైతులిచ్చిన భూముల్లో బయటివారికి ఇళ్ల స్థలాలు కేటాయింపు జోనల్ రెగ్యులేషన్ విధానానికి వ్యతిరేకమని హైకోర్టు ధర్మాసనం 2020 మార్చి 23న స్పష్టంచేసింది. ఇప్పుడు రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో ఇష్టానుసారం మార్పులు చేసేందుకు వీలుకల్పిస్తూ ప్రభుత్వం సీఆర్‌డీఏ చట్టానికి సవరణలు తీసుకొచ్చారు. సీఆర్‌డీఏ చట్టంలో గతంలో లేని సెక్షన్ 53(1)ని ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించింది. రాజధానిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద ఇళ్ల నిర్మాణానికి స్థలాలు పొందేందుకు రాష్ట్రంలోని పౌరులందరూ అర్హులేనని, 29 గ్రామాలకే పరిమితం చేయరాదని పేర్కొంది. మొత్తం 54,307 మంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు రాజధానిలో ఇళ్లస్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 25న జీవో నం.107 జారీ చేసింది. దాన్ని రాజధాని రైతులు హైకోర్టులో సవాలు చేశారు.

ఏ ప్రాంతనికి చెందిన వారికైనా
దానిపై హైకోర్టు ధర్మాసనం తీర్పు చెబుతూ... రైతుల నుంచి సేకరించిన భూముల్లో ఇళ్లస్థలాలు ఇవ్వడం సీఆర్‌డీఏ చట్ట నిబంధనలకు విరుద్ధమని తేల్చిచెప్పింది. రాజధాని పరిధిలో స్థలాల కేటాయింపులో రాష్ట్రప్రభుత్వానికి ఎలాంటి పాత్రా ఉండదని తేల్చిచెప్పింది. ప్రభుత్వం జారీచేసిన జీవో నం.107ని సస్పెండ్ చేసింది. దాంతో ఇప్పుడు ప్రభుత్వం చట్టాన్నే సవరించాలని నిర్ణయించింది. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం పైన రాజధాని తరపు కేసులు వాదిస్తున్న న్యాయవాదులు స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బడుతున్నారు. ఇక, టీడీపీ దీని పైన ఏ రకంగా స్పందించినా..పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అడ్డుపడుతోందంటూ కౌంటర్ ఎటాక్ చేసేందుకు వైసీపీ సిద్దమవుతోంది.












Click it and Unblock the Notifications