రైతులకు రుణాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం,ఇక నుంచి..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తరువాత అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో కలిపి రూ 20 వేలు అందిస్తోంది. ఇప్పటికి రెండు విడతలుగా రూ 7 వేలు చొప్పున రూ 14 వేలు జమ చేసారు. కాగా.. కౌలు రైతుల విషయంలో ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఆర్దికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలవనుంది.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కౌలు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రూ. లక్ష వరకు రుణం అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అర్హులైన కౌలు రైతులకు రూ.లక్ష వరకు రుణాలు ఇచ్చేందుకు అధికారికంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ చొరవ ద్వారా కౌలు రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేసి వారి సాగుకు పెట్టుబడి భరోసా కల్పించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రుణ సహాయ పథకాన్ని అమలు చేయడానికి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను కీలక సంస్థలుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందించడం వల్ల వారు ప్రైవేటు అప్పుల భారం తగ్గించాలని డిసైడ్ అయింది. దీని ద్వారా, ప్రభుత్వ పథకాలు అందని కౌలు రైతులకు ఈ రుణ నిర్ణయం ఉపశమనంగా మారనుంది.

కాగా.. ప్రస్తుతం అధికారులు రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతుల వివరాలు సేకరించే ప్రక్రియను వేగ వంతం చేశారు. ఈ వివరాల సేకరణ పూర్తయిన వెంటనే అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ రుణాలు విత్తనాలు, ఎరువులు, కూలీ ఖర్చుల వంటి ముఖ్యమైన వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడతాయి. ఈ లక్ష రూపాయాల రుణం పొందేందుకు లబ్ధిదారులు సంబంధిత అధికారుల నుంచి జారీ చేయబడిన కౌలు పత్రాలు కలిగి ఉండాలి. అలాగే వారు సహకార సంఘం పరిధిలో నివాసం ఉంటూ ఆ సంఘంలో సభ్యత్వం కలిగి ఉండాలి. రుణానికి దరఖాస్తు చేసే రైతు కౌలు పత్రంలో చూపించిన సాగు భూమి ఎకరాకు తగ్గకుండా ఉండాలనే నిబంధన ఉంది. అయితే అసైన్డ్ భూములు సాగు చేస్తున్న కౌలు పత్రాలు ఉన్నవారు ఈ రుణానికి అర్హులు కారు. సొంత ఇల్లు ఉన్నవారికి ఈ రుణ మంజూరులో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. రుణం పొందిన తేదీ నుంచి ఒక సంవత్సరం లోపు అసలు, వడ్డీని తిరిగి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications