ఏపీలో 3 నెలల్లో2.28 లక్షల ఫించన్ల నిలిపివేత: ఇక..ఏ నెలకు ఆ నెలే : షాకింగ్ నిర్ణయాలతో నష్టమేనా..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ నెలా ఒకటో తేదీనే ఉదయం తమ వాలంటీర్లు ఇంటికి వెళ్లి ఇస్తున్న సామాజిక పెన్షన్ల గురించి ప్రభుత్వం ఇప్పటి వరకు గొప్పగా ప్రచారం చేసుకుంది. జగన్ అధికారంలోకి వచ్చే సమయంలో రెండు వేల పెన్షన్ నుంచి మూడు వేలకు పెంచుకుంటూ పోతామని ప్రకటించారు. అదే విధంగా తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ రూ 250 పెంచుతూ వచ్చే జనవరి నుంచి అమలు చేస్తామని ప్రకటించారు.

ఏ నెలకు ఆ నెలే...
ఇక, ఇప్పటి వరకు రాష్ట్రంలో పెన్షన్ దారులు అనేక కారణాలతో పెన్షన్ పంపిణీ సమయంలో అందుబాటులో లేకుంటే ఆ నెల మొత్తాన్ని ఆ తర్వాత నెలలో ఇచ్చే పెన్షన్లతో కలిపి ఇచ్చేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆగస్టులో తీసుకోని పెన్షన్‌దారులకు సంబంధించిన పెన్షన్ మొత్తం ఈ నెలలో కలిపి ఇవ్వలేదని, అలాంటి వారికి ఇక ఆగస్టు పెన్షన్ రానట్లేనని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఆదేశాలు వెళ్లాయి. దీంతో వారు ముందురోజే గ్రామాల్లో పెన్షన్‌దారులను అప్రమత్తం చేశారు. ఏ నెల పెన్షన్ తీసుకోకపోయినా దానిపై ఆశ వదులుకోవాల్సిందేనని సచివాలయ సిబ్బంది స్పష్టం చేస్తున్నారు.

తగ్గుతున్న లబ్దిదారుల సంఖ్య..
ఇక, గడిచిని మూడు నెలల కాలంలో రాష్ట్రంలో 2.28 లక్షల ఫించన్లను నిలిపివేసారు. ప్రతీ నెలా లబ్దిదారుల జాబితాను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేస్తున్నారు. అయితే, పలు కారణాలను చూపుతూ 2.28 లక్షల మందికి పెన్షన్లు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, అనర్హులను-మరణించిన వారికి తొలిగించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో జూన్ లో 61.46 లక్షలుగా ఉన్న ఫించనుదారుల సంఖ్య సెప్టెంబర్ కు 59.18 లక్షలకు తగ్గింది. ఇప్పటి వరకు గత నెలలో బకాయిలు ఉన్న కలిపి ఇవ్వటం అమల్లో ఉండటంతో... చాలా మంది తమ బకాయిలను ఈ నెలలో తీసుకోవాలని భావించారు.

అర్హత ఉంటే తిరిగి అవకాశం..
అయితే, ఆకస్మికంగా రెండు రోజుల ముందు ఈ నిర్ణయం మారుస్తూ నిర్ణయం తీసుకోవటం లబ్దిదారులకు షాక్ గా మారింది. ఇక, ప్రతీ నెలా పెన్షనర్ల జాబితా పైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం సేకరించి వాటి ఆధారంగా జాబితాలో మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు నుంచి ఒక బియ్యం కార్డు- ఒకే ఫించన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. అనేక కారణాలతో జాబితాలో ఉన్న వారికి పెన్షన్లు నిలిపివేసినా..వారంతా పెన్షన్ కు అర్హత ఉందనే ఆధార పత్రాలను అందిస్తే తిరిగి వారికి పెన్షన్ పునరుద్దరిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఆకస్మిక నిర్ణయంతో సమస్యలు..
క్షేత్ర స్థాయిలో కొన్ని ప్రాంతాల్లో కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందనో, మీ పిల్లలు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్నారనో... ఇలా రకరకాల కారణాలతో పెన్షన్‌దారులకు షోకాజ్ నోటీసులు అందడంతో ప్రతినెలా గండంగానే మారుతోందని వాపోతున్నారు. నిబంధనలకు లోబడి ఉన్నా నోటీసులు జారీ అవుతుండంతో వాలంటర్ల వద్ద లబ్ది దారులు తమ అర్హతను నిరూపించుకోవాల్సి వస్తోంది. జూన్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫించన్ లబ్దిదారుల సంఖ్య 61.46 లక్షలుగా ఉండగా, జూలై లో 60.95 లక్షలకు తగ్గింది. అదే విధంగా ఆగస్టు లో 60.50 లక్షలుగా నిర్దారించారు.
Recommended Video

వైసీపీకి రాజకీయంగానూ నష్టమేనా..
ఈ నెల సెప్టెంబర్ లో అర్హత ఉన్న పించన్ల లబ్ది దారుల సంఖ్య 59.18 లక్షలుగా నిర్ధారించారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఏ నెలకు ఆ నెలే పెన్షన్ విధానం ఆకస్మికంగా అమల్లోకి తీసుకురావటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముందుగా సమాచారం ఇచ్చి ఉంటే..లబ్ది దారులకు నష్టం లేకుండా ఉంటుందనే వాదన వినిపిస్తోంది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం వైసీపీ ప్రభుత్వానికి రాజకీయంగానూ నష్టం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పైన ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications