గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధుల ఖరారు- తాజా ఆదేశాలు.. ఇక నుంచి..!!
ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధులపైన కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే సమయంలో అనేక పనులు తమకు కేటాయిస్తున్నారంటూ ఉద్యోగులు వాపోతున్నారు. దీంతో, దీని పైన స్పష్టత ఇస్తూ ప్రభుత్వం వారికి జాబ్ ఛార్జ్ ఖరారు చేసింది. ఇదే సమయంలో పనుల ప్రాధాన్యతల పైన క్లారిటీ ఇచ్చింది. ఏడు అంశాలతో పనులు కేటాయించిన ప్రభుత్వం.. జాబ్ ఛార్ట్ అమలు బాధ్యతలను అధికారులకు అప్పగించింది.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వారికి నిర్దేశించిన సాధారణ జాబ్‌చార్ట్‌తో పాటు ఆయా శాఖలకు సంబంధించిన పనుల పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పౌరులకు ఇంటి ముంగిటకు సంక్షేమ పథకాలు, సేవలు చేర్చాలని సూచించింది. అదే విధంగా సచివాలయాలకు వచ్చిన విజ్ఞప్తులను పరిష్కరించే లా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. విపత్తులు సంభవించినప్పుడు సిబ్బంది హాజరు కావాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం అప్పగించే బాధ్యతలను ఎప్పటికప్పుడు నెరవేర్చాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సిబ్బందికి ఒకేసారి ఎక్కువ పనులు చేయాల్సి వస్తే, జిల్లా గ్రామ, వార్డు సచివాలయ అధికారి, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో చర్చించి, కలెక్టర్ అనుమతితో పనుల ప్రాధాన్యతను నిర్ణయిస్తారని పేర్కొంది.

గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది.. గ్రామ, వార్డు స్థాయి అభివృద్ధి పనుల్లో చురుగ్గా పాల్గొనాల ని సూచించింది. సచివాలయ సిబ్బంది గ్రామ, వార్డు అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వాములు కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫిర్యాదుల పరిష్కారం కోసం సిబ్బంది నిరంతరంగా పర్యవేక్షణ చేయాలని పేర్కొంది. అదే సమయంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే దివ్యాంగ సిబ్బందికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. దివ్యాంగ సిబ్బందికి ఇంటింటి సర్వే నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో వారికి అనువైన పని వాతావరణం కల్పించాలని.. అలాగే వారి సమస్యల్ని పరిష్కరించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ సమయానుసారం వారికి అప్పగించే ఏ పనులైనా ఆదేశాలకు అనుగుణంగా నిర్వర్తించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications