జగన్ సర్కార్ హైఅలర్ట్: రేపటి నుంచి ఇంటింటి సర్వే: రంగంలో ఎఎన్ఎం, ఆశా వర్కర్లు
అమరావతి: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఏపీ, తెలంగాణల్లో ప్రవేశించింది. తెలంగాణతో పోల్చుకుంటే- ఏపీలో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువే. ఇప్పటిదాకా ఒక్క కేసు మాత్రమే నమోదైంది. విజయనగరం జిల్లాలో తొలి కేసు వెలుగు చూసింది. తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 12కు చేరింది. డజను మంది ఈ వేరియంట్ బారిన పడ్డారు. రెండు రాష్ట్రాల్లోనూ ఈ సంఖ్య పెరగదనే గ్యారంటీ లేదు.

రేపటి నుంచి ఇంటింటి సర్వే..
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు చూపుతో వ్యవహరిస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా ఇంటింటి సర్వేను చేపట్టనుంది. ఇది డోర్ టు డోర్ ఫీవర్ సర్వే. సోమవారం ఆరంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో ఈ సర్వే మొదలవుతుంది. ఈ మేరకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సర్కులర్‌ను జారీ చేశారు.

34వ సారి..
జ్వర పీడితులను గుర్తించడానికి నిర్వహించనున్న సర్వే. జ్వరంతో బాధపడుతున్న వారికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం. ప్రజారోగ్యానికి సంబంధించి జగన్ సర్కార్ ఇంటింటి సర్వే నిర్వహించనుండటం ఇది 34వ సారి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత 33 సార్లు ఈ తరహా సర్వేను చేపట్టింది. జ్వర పీడితులను సకాలంలో గుర్తించడం ద్వారా కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందడాన్ని నివారంచడానికి వీలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

కోవిడ్‌గా తేలితే..ఆసుపత్రికి
సాధారణ జ్వరంగా తేలితే.. వారికి ఇంటివద్దే మాత్రలు, ఇతర ఔషధాలను ఇచ్చే ఏర్పాటు చేసింది. కరోనా వైరస్ లేదా ఒమిక్రాన్ వేరియంట్‌గా తేలితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులకు తరలించి- కోవిడ్ ప్రొటోకాల్స్‌కు అనుగుణంగా చికిత్స అందిస్తుంది. ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించడానికి ఈ డోర్ టు డోర్ ఫీవర్ సర్వేను నిర్వహించనున్నట్లు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ పేర్కొన్నారు. ఈ వేరియంట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఆశా వర్కర్లు..ఎఎన్ఎం..
ఆశా వర్కర్లు, ఎఎన్ఎం, గ్రామ/వార్డు వలంటీర్లు ఇందులో పాల్గొంటారని, వారికి సహకరించాలని సూచించారు. జ్వరంతో బాధపడుతున్న వారు వెంటనే ఎన్ఎంఎన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎఎన్ఎం, ఆశా వర్కర్లు, వలంటీర్లు.. తాము సేకరించిన వివరాలను జిల్లా వైద్యాధికారులకు అందజేయాల్సి ఉంటుంది. దీన్ని యాప్‌లోనూ పొందుపరచాల్సి ఉంటుంది. సర్వే నిర్వహించే సమయంలో సిబ్బంది తప్పనిసరిగా కోవిడ్ ప్రొటోకాల్స్‌ను పాటించాలని ఆదేశించింది.

విజయనగరం జిల్లాలో..
విజయనగరం జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ సోకిన విషయం తెలిసిందే. ఐర్లాండ్ నుంచి విశాఖపట్నానికి వచ్చిన 34 సంవత్సరాల వ్యక్తి ఈ వేరియంట్ బారిన పడ్డారు. కిందటి నెల 27వ తేదీన అతను ముంబై మీదుగా విశాఖపట్నానికి చేరుకున్నాడు. అనంతరం విజయనగరంలోని తన స్వగ్రామానికి వెళ్లారు. ఐర్లాండ్ నుంచి ముంబై విమానాశ్రయంలో దిగిన తరువాత అతనికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. కోవిడ్ నెగెటివ్‌గా తేలింది. అక్కడి నుంచి విశాఖపట్నానికి చేరుకున్న తరువాత మరోసారి కరోనా నిర్ధారణ టెస్టులు చేయగా.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.












Click it and Unblock the Notifications