ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్- డిస్కౌంట్ రేట్లకు ఉల్లి, పప్పు, పామాయిల్..!
ఏపీలో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. మార్కెట్ కు వెళ్లి కూరగాయలు కానీ, నిత్యావసరాలు కానీ కొనలేని పరిస్ధితులు కనిపిస్తున్నాయి. భారీగా పెరిగిపోతున్న ధరలతో జనం అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం (AP Govt) ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లిపాయలు, కందిపప్పు, పామాయిల్, బియ్యాన్ని డిస్కౌంట్ రేట్లకు విక్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు నిత్యావసర ధరల పెరుగుదలను అదుపు చేసే చర్యల్లో భాగంగా ముందుగా ఉల్లి ధరల తగ్గింపుపై దృష్టిసారించింది.
ధరల తగ్గింపులో భాగంగా నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో అనుసంధానం అయి కేజీ ఉల్లిపాయలు రూ.35 లకే ప్రజలకు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధరల స్థిరీకరణపై ఇవాళ మంత్రుల సబ్ కమిటీ సచివాలయంలో భేటీ అయింది. ఇందులో మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెంనాయుడు, సత్యకుమార్ మనోహర్ ఉన్నారు. వీరు బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరలు, తీసుకోవలసిన చర్యలపై చర్చించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు బజార్లు అలాగే ప్రత్యేక కౌంటర్ల ద్వారా కేజీ 35కే ఉల్లిపాయల అమ్మకాలు జరుగుతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 350 పైగా ప్రత్యేక బియ్యం కౌంటర్లు, రైతు బజార్ల ద్వారా బహిరంగ మార్కెట్ కంటే కేజీ రూ.10లు తక్కువగా బియ్యం అమ్మకాలు విజయవంతంగా జరుగుతున్నాయని గుర్తుచేశారు. అలాగే పామాయిల్, కందిపప్పు ధరల మీద సమీక్షించినట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్రం సహకారం తీసుకొని బహిరంగ మార్కెట్ కంటే పామాయిల్ కేజీకి రూ 10 రూపాయల తక్కువగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పామాయిల్ ధరల తగ్గింపుకు వ్యాపారులతో మాట్లాడతామని తెలిపారు. చౌక డిపోల్లో కందిపప్పును కూడా ప్రజలకు డిస్కౌంట్ రేటుకు అందిస్తామన్నారు.













Click it and Unblock the Notifications