సింహాచలం ఆలయ వివాదంలో వెనక్కి తగ్గిన ఏపీ సర్కార్ - సంచైతకూ ఊరట...
విశాఖ జిల్లా సింహాచలం వరాహనరసింహస్వామి దేవస్ధానంలో చందనోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా ప్రధాన అర్చకుడిపై విధించిన సస్పెన్షన్ ను తాత్కాలికంగా ఉపసంహరించుకున్న ప్రభుత్వం... ఇది తుది విచారణకు లోబడి ఉంటుందని ప్రకటించడం విశేషం.

చందనోత్సవం సందర్భంగా వివాదం..
విశాఖ జిల్లా సింహాచలం వరాహనరసింహస్వామి దేవాలయంలో చందనోత్సవం జరిగింది. ఇందులో పాల్గొనేందుకు ప్రధాన అర్చకుడు, ఆలయ ఛైర్మన్ సంచైత గజపతిరాజు సహా 30 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అయితే ఇందులో అనుమతి లేకపోయినా ఆలయ వర్గాలతో సన్నిహితంగా ఉండే తిరుపతి శ్రీను అనే వ్యక్తి ఏకంగా ప్రధాన అర్చకుడి అభ్యంతరాలను సైతం లెక్కచేయకుండా అంతరాలయంలోకి వెళ్లి దర్శనం చేసుకున్నాడు. ఇది కాస్తా బయట లీక్ కావడంతో ట్రస్టు ఛైర్మన్ హోదాలో ఉన్న సంచైతతో పాటు ప్రభుత్వం కూడా ఇరుకునపడింది. చివరికి దీనికి బాధ్యుడిని చేస్తూ ప్రధాన అర్చకుడు గొడవర్తి గోపాల కృష్ణమాచార్యులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

సస్పెన్షన్ కుట్రే అన్న ప్రధాన అర్చకుడు..
ఆలయ పెద్దలతో సన్నిహితంగా ఉండే తిరుపతి శ్రీను అనే వ్యక్తికి పై నుంచి వచ్చిన ఒత్తిళ్లతోనే లోపలికి పంపాల్సి వచ్చిందని, దీనికి బాధ్యులను చేస్తూ తనను సస్పెండ్ చేయడమేంటని ప్రధాన ఆర్చకుడు గోపాలకృష్ణమాచార్యులు భగ్గుమన్నారు. ఇందులో పెద్ద కుట్ర దాగి ఉందంటూ ఆరోపించారు. దీంతో ఆలయ ఛైర్మన్ సంచైతతో పాటు ప్రభుత్వం కూడా ఇరుకునపడింది. మరోవైపు అర్చక సంఘాల నుంచి పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్దితి ఎదురైంది.

సస్పెన్షన్ ఉపసంహరణ.. సంచైతకు ఊరట...
ముప్పేట దాడితో ప్రధాన అర్చకుడు గోపాలకృష్ణమాచార్యులను విధుల్లోకి తీసుకోక తప్పని పరిస్ధితి ఎదురుకావడంతో ప్రభుత్వం మధ్యేమార్గంగా చందనోత్సవ ఘటనపై విచారణకు ఆదేశిస్తూనే సస్పెన్షన్ ను తాత్కాలికంగా ఉపసంహరించుకుంది. దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలోని జాయింట్ కమిషనర్ స్ధాయి అధికారితో ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో తిరుపతి శ్రీను వ్యవహారంలో ప్రధాన అర్చకుడిని విధుల్లోకి తీసుకోవడంతో ఆలయ ఛైర్మన్ సంచైతకు సైతం ఊరట దక్కింది. ఈ వ్యవహారంలో మరికొన్నాళ్లు మౌనం వహిస్తే సంచైతకు ఇబ్బందులు తప్పవని భావించడం వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications