విశాఖకు మరో కీలక కార్యాలయం - హైదరాబాద్ టు వైజాగ్..!!
విశాఖ కేంద్రంగా మరో కీలక కార్యాలయం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా బోర్డును ఏపీకి తరలించాలని ఏపీ ప్రభుత్వం చాలా రోజులుగా కోరుతూ వస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు విశాఖ కు బోర్డు కార్యాలయం తరలింపు పైన కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ కు తాజాగా లేఖ రాసింది. విశాఖపట్నంలోని ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఐఈఐ) బిల్డింగ్‌లో ఈ కార్యాలయం ఏర్పాటు కు ఉన్న అవకాశాలను వివరించింది. కృష్ణా బోర్డు ప్రస్తుతం హైదరాబాద్‌లోని జలసౌధలో ఉంది.

విశాఖలో కృష్ణా బోర్డు
తెలంగాణ ప్రభుత్వం అద్దె లేకుండా బోర్డు ఏర్పాటుకు స్థలం కేటాయించింది. సుమారు రూ.2 కోట్లు ఖర్చు చేసి బోర్డు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. తెలంగాణ మాదిరిగానే ఏపీలోనూ ఫ్రీ అకామిడేషన్ కల్పించాలని బోర్డు పలుమార్లు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. బోర్డును ఏపీకి తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసింది. వైజాగ్‌లో సరిపడా ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేనందున ఐఈఐలో ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. కృష్ణా బోర్డు నిర్వహణకు 17 వేల చదరపు అడుగుల స్థలం అవసరమని లెక్కగట్టారు. తొలి దశలో 7 వేల ఎస్‌ఎఫ్టీ ఇచ్చేందుకు ఐఈఐ ఓకే చెప్పింది.

స్థలం..సౌకర్యాలు సిద్దం
చదరపు అడుగుకు రూ.50 అద్దె చొప్పున ప్లగ్ అండ్ ప్లే సిస్టంలో బోర్డు నిర్వహణకు అనువుగా సౌకర్యాలు సమకూర్చేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది. అయితే, ఇందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక, ఇదే సమయంలో ఈ నెల 28న నిర్వహించాల్సిన బోర్డు సమావేశం మరోసారి వాయిదా పడింది. అదే సమయానికి బ్రజేశ్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ) విచారణ ఉండటంతో సమావేశం వాయిదా వేయాలని కృష్ణా బోర్డును తెలంగాణ ఈఎన్సీ కోరారు. దీంతో సమావేశం అక్టోబర్ 17కు వాయిదా వేస్తున్నట్టు బోర్డు ఎస్‌ఈ లేఖలు రాసారు.

బోర్డు సమావేశం వాయిదా
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల రూల్ కర్వ్స్ (ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్), పవర్ జనరేషన్, ప్రాజెక్టులు సర్ ప్లస్ అయ్యే రోజుల్లో రెండు రాష్ట్రాలు ఉపయోగించుకునే నీటి వినియోగంపై ఆరుగురు సభ్యులతో ఆర్‌ఎంసీని ఏర్పాటు చేశారు. మొదటి రెండు సమావేశాలకు తెలంగాణ సభ్యులు డుమ్మా కొట్టగా, తర్వాత జరిగిన రెండు సమావేశాలకు హాజరై తెలంగాణ రాష్ట్రం తరఫున తమ అభిప్రాయాలు వెల్లడించారు. నాలుగు సమావేశాల్లో చర్చించిన అంశాలపై తుది నిర్ణయం తీసుకొని కృష్ణా బోర్డుకు నివేదిక ఇవ్వడానికి ఐదో మీటింగ్ నిర్వహించాలనుకున్నారు. అయితే.. ఇప్పటికే సమావేశం ఐదుసార్లు వాయిదా పడింది.












Click it and Unblock the Notifications