సహించం: చంద్రబాబుకు నాగం, దెబ్బతీస్తున్నారని టీ కాంగ్రెస్
హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నించడం తెలంగాణ ప్రజల హక్కులను కాలరాయడమేనని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, తెలంగాణ నేత నాగం జనార్దన్ రెడ్డి గురువారం విమర్శించారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాలకు తాగునీరు అందించే ఈ పథకాన్ని అడ్డుకుంటే సహించేదిలేదన్నారు.
బాబుపై తెలంగాణ కాంగ్రెస్ నేతల మండిపాటు
తెలంగాణ సాగునీటి ప్రయోజనాలను దెబ్బతీస్తూ కేంద్రానికి రాసిన లేఖను చంద్రబాబు ఉపసంహరించుకునే విధంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఒత్తిడి తేవాలని టీ కాంగ్రెస్ నేతలు గండ్ర వెంకటరమణా రెడ్డి, రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
గురువారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి చంద్రబాబు అడ్డుపడుతున్నారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా చంద్రబాబు తెలంగాణ పట్ల నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

మహబూబ్‌నగర్ తదితర జిల్లాల సాగునీటి ప్రయోజనాలకు చంద్రబాబు గండికొడుతున్నారన్నారు. తెలంగాణ బీజేపీనేతలు కూడా పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణం సాకరమయ్యేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ పైన ఒత్తిడి తేవాలన్నారు.
శంషాబాద్ దేశీయ విమానాశ్రయం టర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టినా తెలంగాణ టీడీపీ, బీజేపీ నేతలు మాట్లాడకుండా ఉండటం దురదృష్టకరమన్నారు. విద్యుత్, జలాలు, ఇంటర్ పరీక్షల అంశాల్లో వివాదాలు ముదురుతున్నాయని, వీటి పరిష్కారానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలన్నారు.
కాంగ్రెస్ నేతలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కూడా ధ్వజమెత్తారు. రైతుల కడగండ్లను పట్టించుకోకుండా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. రైతుల ఆత్మహత్యల నిరోధానికి చర్యలు తీసుకోవాలన్నారు. సాగర్ వద్ద ఆకాశ హార్మ్యాల నిర్మాణాన్ని వారు స్వాగతించారు. అయితే, సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేయాలన్నారు.
తెలంగాణ సాంస్కృతిక సారథిగా రసమయి
తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా కరీంనగర్ మానకొండూరు ఎమ్మెల్యే, ధూం ధాం అధ్యక్షుడు రసమయి బాలకిషన్‌ను ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ చైర్మన్ పదవికి కేబినెట్ హోదా కల్పించనుంది. ఆయన కేసీఆర్‌కు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications