ఇక ప్రజల్లోకి చంద్రబాబు - సీఐడీ నెక్స్ట్ స్టెప్, ఉత్కంఠ..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు భారీ ఊరట దక్కింది. స్కిల్ స్కాంలో హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ కండీషన్ల కొనసాగింపు పైనా స్పష్టత ఇచ్చింది. ఈ నెల 29 నుంచి చంద్రబాబు ఇక ప్రజల్లోకి వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. ఇదే సమయంలో సీఐడీ తదుపరి అడుగుల పైన ఆసక్తి కొనసాగుతోంది. అటు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్ పైన తీర్పు ఏంటనేది మరింత ఉత్కంఠ పెంచుతోంది.
బెయిల్ దక్కటంతో: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎట్టకేలకు బెయిల్ దక్కింది. స్కిల్ కేసులో సెప్టెంబర్ 9న సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ వెంటనే ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది .రాజమండ్రి జైలులోనే చంద్రబాబు 53 రోజులు ఉన్నారు. అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయటంతో హైదరాబాద్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కంటికి ఆపరేషన్ పూర్తయింది.

అయితే మధ్యంతర బెయిల్ కండీషన్ల కారణంగా చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సమయంలోనే మధ్యంతర బెయిల్ కండీషన్ల కొనసాగింపు పైన స్పష్టత ఇచ్చింది. అదే సమయంలో కొన్ని కీలక సూచనలు చేసింది.
సీఐడీ తదుపరి అడుగులు: గతంలో మధ్యంతర బెయిల్ సమయంలో సూచించిన విధంగానే ఈ నెల 29వ తేదీ వరకు చంద్రబాబు ర్యాలీలు..సభల్లో పాల్గొనవద్దని నిర్దేశించింది. 29వ తేద నుంచి యధావిధిగా రాజకీయ కార్యకలాపాలు కొనసాగించేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఈ నెల 30న చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరు కావాలని కోర్టు సూచించింది.
దీంతో, ఇక డిసెంబర్ 1వ తేదీ నుంచి చంద్రబాబు రాజకీయంగా ప్రజల్లోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది. కానీ, ఈ సమయంలోనే ఇతర కేసుల్లోనూ...హైకోర్టు ఇచ్చిన బెయిల్ విషయంలో ఏ విధంగా ముందుకెళ్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు పైన సీఐడీ సుప్రీంకు వెళ్తుందా..లేక క్వాష్ పిటీషన్ పైన తీర్పు వచ్చిన తరువాత ఆ తీర్పు సారాంశానికి అనుగుణంగా వ్యవహరిస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
సుప్రీంలో క్వాష్ తీర్పు వేళ: ఇక, చంద్రబాబు పైన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్..ఫైబర్ నెట్.. లిక్కర్ వ్యవహారంలోనూ కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి సీఐడీ ఏం చేస్తుందనేది ఇప్పుడు న్యాయపరంగా కీలక అంశంగా మారుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ కేసుల్లో ప్రభుత్వం తరపు నుంచి వచ్చే అనుమతులు..తీసుకొనే నిర్ణయాలు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
దీంతో, సుప్రీంకోర్టులో రేపు లేదా ఈ వారంలోనే క్వాష్ పిటీషన్ పైన తీర్పు వెలువడే అవకాశం ఉంది. 17ఏ పైనే ఈ కేసులో ప్రధానంగా వాదనలు జరగటంతో..సుప్రీం తీర్పు చూసిన తరువాత సీఐడీ తదుపరి అడుగులు వేసే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. అటు చంద్రబాబు కు రెగ్యులర్ బెయిల్ రావటం పైన టీడీపీ శ్రేణులు సంతోషంతో ఉన్నారు.












Click it and Unblock the Notifications