స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్: మాజీ ఎండీ గంటా సుబ్బారావుకు బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు
అమరావతి: రాష్ట్రంలో సంచలన సృష్టించిన ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కుంభకోణం దర్యాప్తు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. కుంభకోణం ఆరోపణలతో అరెస్టయిన సంస్థ మాజీ ముఖ్యకార్యనిర్వహణాధికారి, మేనేజింగ్ డైరెక్టర్ గంటా సుబ్బారావుకు బెయిల్ లభించింది. ఏపీ హైకోర్టు కొద్దిసేపటి కిందటే ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. 241 కోట్ల రూపాయల మేర సంస్థ నిధులను దుర్వినియోగం చేశారంటూ ఆయన ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఈ కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.
గంటా సుబ్బారావు తరుఫు న్యాయవాది ఇదివరకే బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఇవ్వాళ విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు బెయిల్‌కు అనుమతి ఇచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తోన్న కుంభకోణంలో మాజీ డైరెక్టర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణతో పాటు గంటా సుబ్బారావు అరెస్టయ్యారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం చోటు చేసుకుందని, కొన్ని షెల్ కంపెనీలను సృష్టించి, తాము లబ్ది పొందినట్లు వచ్చిన ఆరోపణలపై ఏపీ సీఐడీ అధికారులు ఈ దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా లక్ష్మీనారాయణ, గంటా సుబ్బారావు సహా మరికొందరిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శివార్లలోని షాబాద్‌లో గల గంటా సుబ్బారావు నివాసంపై ఈ నెల 9వ తేదీన అధికారులు దాడులు చేశారు. ఆయనను విజయవాడకు తీసుకొచ్చారు. రెండు రోజుల పాటు విచారణ జరిపారు.
ఈ కేసులో గంటా సుబ్బారావును ఏ1గా నిర్ధారించారు సీఐడీ అధికారులు. పుణేకు చెందిన డిజైన్ టెక్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఖన్విల్కర్, ఢిల్లీకి చెందిన స్కిల్లర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అగర్వాల్, నోయిడాలో నివసిస్తున్న సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్‌ను కూడా అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరచగా ఈ నెల 24 వరకు రిమాండ్ విధించారు. ఇదే కేసులో అరెస్టయిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి లక్ష్మీనారాయణకు ఇదివరకే ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు తాజాగా గంటా సుబ్బారావుకు కూడా బెయిల్ లభించింది. ప్రస్తుతం ఆయన మచిలీపట్నం జైలులో ఉంటున్నారు. ఆయన తరఫు న్యాయవాది బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు.. కొద్దిసేపటి కిందటే బెయిల్‌ను మంజూరు చేసింది. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అవినీతి చోటు చేసుకున్నట్లుగా ఫోరెన్సిక్ ఆడిట్ ధృవీకరించడంతో జగన్ సర్కార్ దర్యాప్తునకు ఆదేశించింది. ఆ అవినీతి చోటు చేసుకున్న సమయంలో లక్ష్మీనారాయణ ఈ కార్పొరేషన్ డైరెక్టర్‌గా పనిచేశారని సమాచారం. 2015లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సీమెన్స్ ప్రాజెక్టులను నెలకొల్పడానికి రాష్ట్రవ్యాప్తంగా ఆరు క్లస్టర్లకు అనుమతి ఇచ్చింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించిన క్లస్టర్లు ఇవి.












Click it and Unblock the Notifications