చంద్రబాబుపై జగన్ కేసుల సమీక్ష తప్పదా ? హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబుపై పలు సివిల్, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇందులో స్కిల్ డెవలప్మెంట్ స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ వ్యవహారం, మద్యం, మైనింగ్ అనుమతుల వంటివి ఉన్నాయి. వీటిపై గతంలో సుప్రీంకోర్టు వరకూ వెళ్లి బెయిల్ తెచ్చుకున్న చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అయితే ఇప్పుడు వాటిని కొనసాగించాలా వద్దా అన్న ప్రశ్న ప్రభుత్వానికి ఎదురవుతోంది. సహజంగా అయితే వాటిని వెనక్కి తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దం కావాల్సి ఉంది. ఇదే అంశం హైకోర్టులో ప్రస్తావనకు వచ్చింది.
గతంలో వైసీపీ హయాంలో చంద్రబాబుతో పాటు టీడీపీ నేత నారాయణ, ఇతరులపై దాఖలైన పలు కేసుల విచారణను సీబీఐ, ఈడీకి అప్పగించాలని కోరుతూ విజయవాడకు చెందిన ఓ జర్నలిస్టు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆయా కేసుల్ని సమీక్షించి వెనక్కి తీసుకునే అవకాశం ఉందని, కాబట్టి వాటిని సీబీఐ, ఈడీకి అప్పగించాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

గతంలో వైసీపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసులను ఇప్పటి ప్రభుత్వం సమీక్షించకుండా ఎలా ఉత్తర్వులు ఇవ్వగలమని పిటిషనర్ ను ప్రశ్నించింది. ఆయా కేసుల హేతుబద్ధతను తెలుసుకుని, వాటిని ఉపసంహరించాలా వద్దా అన్న అంశం ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని తెలిపింది. ఇప్పటివరకూ ప్రభుత్వం ఆయా కేసుల్ని ఉపసంహరించుకుంటూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వని విషయాన్ని గుర్తుచేసింది. అదే సమయంలో చంద్రబాబుపై నమోదైన కేసులపై అభిప్రాయం కోరుతూ సీఎస్, హోంశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications