గల్లా ఫ్యామిలీకి మరో ఎదురు దెబ్బ-ఈసారి టార్గెట్ గల్లా ఫుడ్స్-భూముల పిటిషన్ పై హైకోర్టు నోటీసులు
ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిసిన ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన గల్లా సంస్ధలు ఇప్పుడు వైసీపీ హయాంలో వరుసగా ఇబ్బందుల్లో పడుతున్నాయి. ఇప్పటికే గల్లా కుటుంబానికి చెందిన అమరరాజా బ్యాటరీస్ కాలుష్య వివాదాల్లో చిక్కుకోగా.. ఇప్పుడు తాజాగా గల్లా ఫుడ్స్ లిమిటెడ్ భూముల వివాదం హైకోర్టుకెక్కింది.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గల్లా ఫుడ్స్ లిమిటెడ్ స్ధాపన కోసం ప్రభుత్వం నుంచి గల్లా కుటుంబం భూములు తీసుకుంది. కానీ వీటిలో ఇప్పటివరకూ నిర్మాణాలు చేపట్టలేదు దీంతో ఈ భూముల్ని నిబంధనల మేరకు ఏపీఐఐసీ లాక్కోవాలని కోరుతూ చిత్తూరు జిల్లాకు చెందిన పురుషోత్తంనాయుడు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఈ వ్యవహారంలో సంబంధిత విభాగాలకు నోటీసులు జారీ చేసింది.

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తేనాపల్లి, పేట అగ్రహారం గ్రామాల పరిధిలో పరిశోధనాభివృద్ధి కేంద్రం(ఆర్ అండ్ డీ) ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి 28 ఎకరాల భూమి తీసుకున్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన గల్లా ఫుడ్స్ ఇప్పటి వరకు ఎలాంటి పనులు మొదలు పెట్టలేదు. దీంతో గల్లా ఫుడ్స్ లిమిటెడ్ సంస్థకు ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకునేలా ఏపీఐఐసీని ఆదేశించాలని కోరుతూ చిత్తూరు జిల్లా నల్లగట్లపల్లికి చెందిన జి.పురుషోత్తంనాయుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. భూముల విక్రయ ఒప్పంద నిబంధనలను గల్లా ఫుడ్స్ ఉల్లంఘించిందని ఆయన హైకోర్టు దృష్టికి తెచ్చారు.
గల్లా ఫుడ్స్ భూముల వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు... పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీఐఐసీ సీఎండీ, ఏపీఐఐసీ ప్రాంతీయ మేనేజరు, గల్లా ఫుడ్స్ లిమిటెడ్కు నోటీసులు జారీ చేసింది. గల్లా ఫుడ్స్ నుంచి భూములు వెనక్కి తీసుకోవడంపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. గల్లా కుటుంబానికి చెందిన పలు సంస్ధల్ని వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందన్న ప్రచారం మధ్య అమరరాజా బ్యాటరీస్ చెన్నైకు వెళ్లిపోవడానికి సిద్ధమైంది. అదే సమయంలో గల్లా ఫుడ్స్ పై హైకోర్టు నోటీసుల ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని భూములు వెనక్కి తీసుకుంటే మాత్రం వీరికి మరో ఎదురుదెబ్బ తప్పదు.












Click it and Unblock the Notifications