జగన్ ఇంట్లో ఫర్నిచర్ ఎపిసోడ్ లో ట్విస్ట్ -సర్కార్ లాస్ట్ మినిట్ ఝలక్..!
ఏపీలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం ఆయనకు కేటాయించిన ఫర్నిచర్ వ్యవహారం ఇప్పటికీ తేలలేదు. జగన్ ఇంట్లో ఫర్నిచర్ ను స్వాధీనం చేసుకోండి లేకపోతే ఎంతవుతుందో చెప్పండి డబ్బులిచ్చేస్తాం అంటూ వైసీపీ చేసిన ప్రతిపాదనపై ఎటూ తేల్చకుండా సాధారణ పరిపాలన శాఖ అంతకంతకూ ఆలస్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ తరఫున ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
జగన్ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునేలా సాధారణ పరిపాలనాశాఖకు ఆదేశాలు ఇవ్వాలని అప్పిరెడ్డి హైకోర్టును కోరారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణకు సిద్దమైంది. అదే సమయంలో ప్రభుత్వం ట్విస్ట్ ఇచ్చింది. అసలు వైసీపీ నేత అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ లో వివరాలే సరిగా లేవని హైకోర్టు దృష్టికి తెచ్చింది. వైసీపీ ఈ పిటిషన్ దాఖలు చేయడానికే వీల్లేదని హైకోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో హైకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

వైసీపీ నేత అప్పిరెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ లోని వెరిఫికేషన్ కాలమ్ లో వివరాలన్నీ తప్పుల తడకగా ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. దీంతో అసలు ఈ పిటిషన్ కు నంబర్ ఎలా కేటాయించారంటూ న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ ప్రశ్నించారు. చివరికి పిటిషనర్ అప్పిరెడ్డి తప్పులు సరిచేసుకునేందుకు హైకోర్టును సమయం కోరారు. దీంతో హైకోర్టు కూడా రెండు వారాలు సమయం ఇచ్చింది. అప్పటివరకూ విచారణను వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications