Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకు మళ్లీ షాక్-బెయిల్ పై హైకోర్టు తీర్పు...!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓ రేంజ్ లో రెచ్చిపోయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూటమి ప్రభుత్వంలో వరుస షాకులు తప్పడం లేదు. ముఖ్యంగా గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసుతో పాటు ఈ కేసులో సాక్షిగా ఉన్న సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించడం, స్థలం ఆక్రమణ కేసుల్లో ఆయనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దీంతో వంశీ రిమాండ్ ను కోర్టు ఎప్పటికప్పుడు పొడిగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
వల్లభనేని వంశీ తనపై దాఖలు అయిన మూడు కేసుల్లో ఒకటైన స్ధలం కబ్జా కేసులో బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ మరోసారి విచారణకు వచ్చింది. అయితే ప్రభుత్వ లాయర్ దీనిపై ప్రభుత్వం స్పందన తీసుకుని చెప్తానని కోర్టుకు తెలిపారు. దీంతో వంశీ బెయిల్ పిటిషన్ పై నిర్ణయాన్ని హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది. దీంతో మరో వారం రోజుల పాటు వంశీకి బెయిల్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.

ఇప్పటికే తనపై దాఖలైన మూడు కేసుల్లో పోలీసులు వరుసగా పీటీ వారెంట్లను దాఖలు చేశారు. అలాగే కస్టడీలోకి తీసుకుని విచారణ కూడా జరిపారు. దీంతో విచారణకు సహకరిస్తాననే షరతుతో తనకు బెయిల్ ఇవ్వాలని వంశీ కోరుతున్నారు. అయితే ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించకుండా ఆలస్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే వారం వంశీ బెయిల్ పై ప్రభుత్వ స్పందన ఆధారంగా హైకోర్టు తమ నిర్ణయం ప్రకటించనుంది.
వల్లభనేని వంశీ పై ముందుగా నమోదైన గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇప్పటికే కోర్టు వరుసగా రిమాండ్ పొడిగిస్తూ వస్తోంది. ఈ కేసులో బెయిల్ కోసం వంశీ పిటిషన్ దాఖలు చేసినా పోలీసులు వ్యతిరేకించారు. దీంతో కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. ఈ మూడు కేసుల్లో బెయిల్ లభిస్తే తప్ప వల్లభనేని వంశీకి విముక్తి లభించేలా లేదు.












Click it and Unblock the Notifications