
జీవో నంబర్ 1పై స్టే-వెకేషన్ బెంచ్ పై హైకోర్టు సీజే ఆగ్రహం-పిటిషనర్ పైనా కీలక వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 1 వ్యవహారం ఇవాళ హైకోర్టు రెగ్యులర్ బెంచ్ లో ఇవాళ విచారణకు వచ్చింది. అయితే ఈ జీవో అమలుపై తాత్కాలిక స్టే విధిస్తూ వెకేషన్ బెంచ్ గతంలో ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు సీజే స్పందించారు. వెకేషన్ బెంచ్ నిర్ణయాన్ని తప్పుబడుతూ సీజేఐ ఇవాళ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పటికే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లి అక్కడి నుంచి మరోసారి హైకోర్టు రెగ్యులర్ బెంచ్ కు చేరిన ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయింది.

జీవో నంబర్ 1పై వెకేషన్ బెంచ్ స్టే
ఏపీ ప్రభుత్వం కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో జీవో నంబర్ 1ను తీసుకొచ్చింది. దీని ప్రకారం రోడ్లపై ర్యాలీలు, రోడ్ షోలు, సభలు దాదాపుగా నిషేధించారు. దీన్ని సవాల్ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటికే హైకోర్టు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో వెకేషన్ బెంచ్ దీనిపై విచారణ చేపట్టింది. అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన ఏజీ శ్రీరాం సుబ్రమణ్యం అభ్యంతరం చెప్పినా పట్టించుకోకుండా జీవో నంబర్ 1పై స్టే కూడా ఇచ్చేసింది. ఇప్పుడు ఈ ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి.

సుప్రీంకోర్టుకెళ్లిన జగన్ సర్కార్
జీవో నంబర్ 1 అమలుపై ఈ నెల 23న వరకూ ఆంటే ఇవాళ్టి వరకూ తాత్కాలిక స్టే ఇస్తూ జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని హైకోర్టు వెకేషన్ బెంచ్ గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తాత్కాలిక స్టేపై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. అంతే కాదు ఈ వ్యవహారాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించింది. దీంతో ప్రభుత్వం తిరిగి హైకోర్టును ఆశ్రయించింది.

వెకేషన్ బెంచ్ పై సీజే ఫైర్
జీవో నంబర్ 1 విషయంలో హైకోర్టు వెకేషన్ బెంచ్ గతంలో విచారణ చేపట్టడం, తాత్కాలిక స్టే విధింపును ఇవాళ ఛీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తప్పుబట్టారు. జీవో నంబర్ 1 విషయంలో గతంలో వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాల్ని ఇవాల ప్రధాన న్యాయమూర్తి పరిశీలించారు. ఈ సందర్బంగా వెకేషన్ బెంచ్ తీరుపై సీజే తీవ్ర అభ్యంతరం తెలిపారు. బెంచ్ ను ఉద్దేశించి సీజే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫైనల్ గా వెకేషన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు సిద్ధమయ్యారు.

హైకోర్టు సీజే తీవ్ర వ్యాఖ్యలు ?
వెకేషన్ కోర్టు న్యాయమూర్తి డీఫాక్టో సీజేగా వ్యవహరిస్తున్నారంటూ సీజే ప్రశాంత్ మిశ్రా ఇవాళ మండిపడ్డారు.కేసును స్వీకరించడం ద్వారా వెకేషన్ కోర్టు సీజే స్థానాన్ని తక్కువ చేసిందన్నారు. ఇది కొనసాగడానికి అనుమతిస్తే ప్రతి వెకేషన్ న్యాయమూర్తి సీజే అవుతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతీ అంశం మూలాల్లోకి వెళ్లకుండా పక్కనబెడితే ఇబ్బందులు తప్పవన్నారు. హైకోర్టులోని ప్రతి వెకేషన్ కోర్ట్ ఏదైనా విషయాన్ని తీసుకుంటుందని, దాని ఫలితం ఏంటన్నది ముఖ్యమన్నారు. ఆ రోజు ఏం జరిగిందో, ఎలా జరిగిందో అన్నీ తనకు తెలుసన్నారు. ఏమి జరుగుతుందో తనకు తెలియదని అనుకోవద్దన్నారు. ఈ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండే అధికారాలపై తనకు పూర్తి పట్టు ఉందన్నారు. పిటిషనర్ (రామకృష్ణ) ఏమైనా ధర్నా చేశారా, హైకోర్టు తీర్పు పిటిషనర్ కు కూడా ప్రయోజనం చేకూర్చకపోతే అత్యవసరం ఎలా అవుతుందన్నారు. లంచ్ మోషన్ చేపట్టాల్సిన అత్యవసరం ఏమిటన్నారు. గత 10 రోజులలో మీరు ఏదైనా ధర్నా చేశారా అని సీజే.. పిటిషనర్ ను ప్రశ్నించారు. మీకు అత్యవసరం లేకపోతే లంచ్ మోషన్‌ను ఎందుకు చేపట్టాలని ప్రశ్నించారు.