తెలంగాణ నుంచి ఏపీకి ఎన్ని డబ్బులు రావాలో తెలుసా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి పది సంవత్సరాలు పూర్తయ్యాయి. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు రాష్ట్రాలకు ఒకే రాజధానిగా హైదరాబాద్ పది సంవత్సరాలపాటు వ్యవహరించింది. ఇకనుంచి ఒక్క తెలంగాణకే రాజధానిగా వ్యవహరించనుంది. రాష్ట్రాన్ని విభించిన సమయంలో ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వాటిల్లో కొన్నింటిని ఇరు రాష్ట్రాలు పరిష్కరించుకున్నాయికానీ మరికొన్నింటిపై మాత్రం సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. వీటిల్లో తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన నిధుల కేసు కూడా ఉందని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు.
గృహ నిర్మాణ సంస్థ అంచనా ప్రకారం..
రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ లెక్కల ప్రకారం ఏపీకి రూ.5,170 కోట్లు రావాల్సి ఉందని, ఇరు రాష్ట్రాలకు చెందిన ఉమ్మడి ఆస్తులపై సుప్రంకోర్టుతోపాటు హైకోర్టుల్లో కూడా కేసులున్నాయని మంత్రి వెల్లడించారు. వీటిని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి నిధులను ఏపీకి తీసుకువచ్చేలా కృషిచేయాలని అధికారులకు సూచించారు. వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులున్న సంస్థల విషయంలో కూడా ఏపీ, తెలంగాణ మధ్య ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా 9, 10 షెడ్యూళ్లలో ఉన్న సంస్థల విషయంలోని సమస్యలు మాత్రం పరిష్కారమవడంలేదు.

కోర్టులు అవసరంలేదు
ఈ రెండు రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికను అప్పులతోపాటు ఆస్తులను పంపిణీ చేసుకోవాలి. ఈమేరకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్రం పొందుపరిచింది. అయితే విభజన జరిగిన తర్వాత ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందాలంటూ తెలంగాణ ప్రభుత్వం కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో కొన్ని సమస్యలు పరిష్కరామయ్యే దశలో ఉండి కూడా ఆగిపోయాయని, వీటిపై దృష్టిపెట్టి ఏపీకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు కోర్టుల పరిధిలోకి వెళ్లే అవసరం లేకుండా చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకుందామంటూ తెలంగాణ ప్రభుత్వం ఏపీ దృష్టికి తీసుకువచ్చింది.












Click it and Unblock the Notifications