తమిళనాడు బదులు ఏపీలో 29వేల కోట్ల భారీ పెట్టుబడుల మెగా ప్రాజెక్ట్!
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి ఒక భారీ శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ రంగ నౌకా నిర్మాణ సంస్థ 'మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్' ఏపీలో ఏకంగా రూ.29,000 కోట్లకు పైగా భారీ పెట్టుబడి పెట్టేందుకు తీవ్రంగా యోచిస్తోందని సమాచారం. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించకపోవడం వల్ల చేజారిన ఈ మెగా ప్రాజెక్టు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు వరంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తమిళనాడులో భారీ గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ మరియు మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్
నిజానికి, తమిళనాడులో తూర్పు తీరంలో ఒక భారీ గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ మరియు మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని మజ్‌గావ్ డాక్ భావించింది. అందుకోసం తమిళనాడులోని తూత్తుకుడిని ఎంచుకుని, 2025 సెప్టెంబర్‌లో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహనా ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

తమిళనాడులో పెట్టుబడులు పెట్టాలని భావించిన మజ్‌గావ్ డాక్
దాదాపు 1,050ఎకరాల విస్తీర్ణంలో, 10 నుండి 12 ఏళ్ల కాలపరిమితితో, రూ.15,000 కోట్ల నుండి రూ.18,000 కోట్ల పెట్టుబడితో అతిపెద్ద ముడి చమురు రవాణా నౌకల అవసరాలను తీర్చేలా ఈ యార్డును నిర్మించాలని బోర్డు ఆమోదించింది. అయితే, ఎండీఎల్ సంస్థ తమిళనాడు ప్రభుత్వం నుండి 'ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్' కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఒక ఊహించని పరిణామం ఎదురైంది.
ఆ వ్యాపార ఒప్పందంతో తమిళనాడు నుండి ఏపీకి మజ్‌గావ్ డాక్
తమిళనాడు ప్రభుత్వం ఇటీవల జరిగిన 'రైజింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కాంక్లేవ్' వేదికగా 'హెచ్‌డీ హ్యుందాయ్' అనే విదేశీ సంస్థతో తూత్తుకుడిలో షిప్‌యార్డ్ ఏర్పాటు కోసం ప్రత్యేక వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన మజ్‌గావ్ డాక్‌ను పక్కనబెట్టి, విదేశీ సంస్థకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఎండీఎల్ తన ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది.తమిళనాడు సర్కారు నుండి సరైన స్పందన లేకపోవడంతో, మజ్‌గావ్ డాక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంది.
రూ.29,000 కోట్ల బడ్జెట్‌తో సరికొత్త ప్రణాళిక
ఏపీలో నౌకా నిర్మాణ క్లస్టర్ స్థాపన కోసం ఏకంగా రూ.29,000 కోట్ల బడ్జెట్‌తో సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను, అనువైన తీరప్రాంత భూములను పరిశీలించడానికి ఎండీఎల్ ఉన్నతాధికారుల బృందం త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనుంది. ఈ ప్రాజెక్టు గనుక కార్యరూపం దాల్చితే ఏపీ తీరప్రాంత రూపురేఖలు మారడమే కాకుండా, వేల సంఖ్యలో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.













Click it and Unblock the Notifications