రంగంలో ఏపీ కాపునాడు: రాజకీయ తీర్మానాలపై ఉత్కంఠత
కాకినాడ: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోంది ఏపీ. ఇంకో తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది.ఈ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు సమాయాత్తం కావాల్సి ఉంది. మేనిఫెస్టో రూపకల్పన, ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించాల్సి ఉంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే పలు కార్యక్రమాలతో జనం మధ్యే ఉంటోంది. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రతి ఇంటికీ వెళ్తోన్నారు ఆ పార్టీ నాయకులు. క్షేత్రస్థాయిలో ఆయా నియోజకవర్గాల శాసన సభ్యులు, ఇన్‌ఛార్జీలు సైతం విస్తృతంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటోన్నారు. నేరుగా ప్రజలను కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకుంటోన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల తీరుతెన్నులు, అందులో ఉన్నాయని భావిస్తోన్న లోపాలు, జగన్ సర్కార్‌పై ఉన్న అభిప్రాయాలను స్వయంగా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్‌ను తీసుకుంటోన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం సందర్భంగా తమ దృష్టికి వస్తోన్న సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం.
అటు తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల్లో ఉంటోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. యువగళం పేరుతో పాదయాత్రను కొనసాగిస్తోన్నారు. ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది ఈ పాదయాత్ర. అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వారాహి బస్సు యాత్ర పేరుతో విస్తృతంగా జిల్లాల్లో పర్యటిస్తోన్నారు. రెండు విడతల్లో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటించారాయన.
ఈ పరిస్థితుల మధ్య- వివిధ సామాజిక వర్గాలు సైతం రాజకీయ ప్రాధాన్యతను కోరుకుంటోన్నాయి. ఏపీ కాపునాడు ఐక్యవేదిక రంగంలోకి దిగింది. రాజకీయ పార్టీలకు అతీతంగా కాపు నాయకులను ఏకం చేయనుంది. ఇందులో భాగంగా ఆగస్టు 13వ తేదీన భారీ సమావేశాన్ని నిర్వహించబోతోంది. దీనికి కాకినాడను వేదికగా ఎంచుకుంది.
కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు సంబంధించిన విషయాలపై చర్చించడానికి ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, ఆయా సామాజిక వర్గానికి చెందిన మేధావులు హాజరు కావాలని ఏపీ కాపునాడు ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఇందులో కొన్ని కీలకమైన రాజకీయ తీర్మానాలు ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.












Click it and Unblock the Notifications