వారి కోసం లక్ష ఎకరాలతో భూ బ్యాంకు.. ఏపీ సర్కార్ బిగ్ ప్లాన్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో పరిశ్రమల ఏర్పాటు కోసం అన్ని మార్గాలలో ప్రయత్నం చేస్తుంది. ఏపీలో పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేయడానికి తాజాగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ ఒక విస్తృతమైన ప్రణాళికను రూపొందించింది.
లక్ష ఎకరాలతో భూ బ్యాంకును ఏర్పాటు చేయటానికి నిర్ణయం
ఇందులో భాగంగా ప్రభుత్వం కనీసం లక్ష ఎకరాలతో భూ బ్యాంకును ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని భూములను దశలవారీగా సేకరించే విధంగా జిల్లా కలెక్టర్లకు ప్రతిపాదనలను పంపించింది. అయితే కీబోర్డ్ బ్యాంకులో 60 శాతం నుండి 70 శాతం వరకు ప్రభుత్వ భూములు ఉండగా, వీటిలో మధ్యలో అక్కడక్కడా ఉన్న ప్రైవేట్ భూములను కూడా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రధానంగా 60,000 ఎకరాల సేకరణ పైన ఏపీఐఐసీ దృష్టి
పరిశ్రమలకు అవసరమైన భూముల కోసం ప్రధానంగా 60,000 ఎకరాల సేకరణ పైన ఏపీఐఐసీ దృష్టి సారించింది. భూముల సేకరణతో పాటు, మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ఈ మేరకు పెద్ద మొత్తంలో నిధులను ఖర్చు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రలతో పోలిస్తే మెరుగైన భూ బ్యాంక్ ఉందని దీనిని సేకరించి పెట్టుకుంటే, భవిష్యత్తులో పరిశ్రమల అవసరాలకు ఉపయోగపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు భూములు కేటాయించిన ఏపీ సర్కార్
ఏపీలో ఇప్పటివరకు ఏపీఐఐసీ 1.75 లక్షల ఎకరాలను వివిధ పరిశ్రమల కోసం కేటాయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో 22 వేల ఎకరాలు సేకరించారు. ప్రస్తుతం బి బి సి ఎల్ కు 6000 ఎకరాలు, జెఎస్డబ్ల్యు కు 3200 ఎకరాలు, భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కు మూడు వేల ఎకరాలు, ఇండో సోల్ కు 1000 ఎకరాలు, ntpc కి 4000 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు.
ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న పరిశ్రమలకు 1. 25 లక్షల ఎకరాల భూమి అవసరం
వీటితోపాటు ఇతర పరిశ్రమల కోసం మరో 60 వేల ఎకరాలను సేకరించాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ఏడాది కనీసం 20,000 ఎకరాలు సేకరించాలని ఏపీఐఐసీ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలకు కనీసం 1. 25 లక్షల ఎకరాల భూమి అవసరమని ఏపీఐఐసీ అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే భూసేకరణకు భూ బ్యాంక్ ఏర్పాటుకు రంగంలోకి దిగింది.
భూముల సేకరణ పనిలో ఏపీఐఐసి
ప్రస్తుతం వివిధ జిల్లాలలో 46, 845 ఎకరాల భూమి ఏపీఐఐసీ వద్ద అందుబాటులో ఉంది. పరిశ్రమల కేటాయింపులు పూర్తి అయిన తర్వాత కనీసం లక్ష ఎకరాల భూ బ్యాంకును నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించినట్లు ఏపీఐఐసీ చెప్తుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న భూములు గుర్తించామని, త్వరలోనే ఈ భూ సేకరణ ప్రక్రియను మొదలు పెడతామని, ఇది ఏపీ పారిశ్రామిక ప్రగతికి దోహదం చేస్తుందని చెబుతోంది.














Click it and Unblock the Notifications