బాబు, జగన్ తహతహ: రాజధానిపై త్వరగా తేల్చకుంటే..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని నిర్మాణం కోసం అధికార పక్షంతో పాటు విపక్షాలు సైతం తహతహలాడుతున్నట్లుగా కనిపిస్తున్నాయంటున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా కొద్దిరోజుల పాటు జరిగిన శాసనసభా సమావేశాల్లోనే సీమాంధ్ర ప్రతినిధులు చేదు అనుభవాన్ని చవిచూశారు.
స్పీకర్ కోడెల శివప్రసాద్‌తో పాటు స్వపక్ష, విపక్ష ఎమ్మెల్యేలందరూ రానున్న శాసనసభ సమావేశాలను సీమాంధ్ర నిర్వహించుకోవాలంటూ బాహాటంగానే చంద్రబాబును కోరుతున్నారు. తాత్కాలికంగానైనా అందుబాటులో ఉన్న భవనాల్లో సచివాలయం ఏర్పాటు చేసుకుని ఏపీ నుంచే పరిపాలన సాగించాలని మంత్రులు సైతం ఒత్తిడి తెస్తున్నారు. హైదరాబాద్‌కే పరిమితమైన నీటిపారుదలశాఖ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి దేవినేని విజయవాడలో ఏర్పాటు చేయించుకున్నారు.

దశలవారీగా కార్యాలయంలోని అన్ని విభాగాలను తరలింపచేస్తానని మంత్రి దేవినేని చెబుతున్నారు. దీనికి తగ్గట్లుగానే సీమాంధ్ర చీఫ్ ఇంజనీర్లతో వివిధ ప్రాజెక్టులపై విజయవాడ నుంచే సమీక్ష సమావేశాలు నిర్వహించడం ప్రారంభించారు. ఇదిలా ఉండగా విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు కోసం అవసరమైతే పోరాటం చేసేందుకు సిపిఐ సన్నద్ధమవుతున్నది. విజయవాడలో రాష్ట్ర కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలోనూ రాజధాని నిర్మాణంపైనే చర్చ జరిగింది. విజయవాడలో రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వం నడుం కట్టాలని రాయలసీమకు చెందిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గట్టిగా చెబుతున్నారు. ఇందుకోసం అవసరమైతే పోరాటం కూడా ప్రారంభిస్తామన్నారు. మరోవైపున ఇప్పటివరకు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న వేల సంఖ్యలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు సీమాంధ్రకు తరలిరావటానికి సన్నద్ధమవుతున్నాయి. ప్రత్యేక రిజిస్ట్రేషన్ కోసం హైదరాబాద్‌కే పరుగులు తీయాల్సి వస్తున్నది.
కనీసం ఈ కారణంతోనైనా వివిధ శాఖలు ప్రధాన కార్యాలయాలు, సచివాలయం విజయవాడ - గుంటూరు మధ్య ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రస్తుతం రాజధాని కోసం భూసేకరణ అటుంచి నాగార్జున విశ్వవిద్యాలయంలో అందుబాటులో ఉన్న భవనాలు, అలాగే మంగళగిరి పోలీస్ బెటాలియన్‌లో సచివాలయం, అసెంబ్లీ, రాజ్‌భవన్, డిజిపి కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని మన పరిపాలనను మనమే సాగించుకోవచ్చని చెబుతున్నారు.
రాజధాని విషయంలో జాప్యం జరిగే కొద్దీ ప్రధానంగా భూముల విలువలు అనూహ్యంగా పెరిగే అవకాశం లేకపోలేదని, అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకోవాల్సి ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్యనాయుడు ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. తెలంగాణ వారి చీదరింపుల మధ్య హైదరాబాద్ నుంచి పరిపాలన సాగించడం అంత శ్రేయస్కరం కాదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపి కంభంపాటి హరిబాబు కూడా చెబుతున్నారు. మరోవైపు విజయవాడ ఎంపి కేశినేని నాని మాత్రం ఢిల్లీలోనే మకాం వేసి విజయవాడ కేంద్రంగానే రాజధాని ఏర్పాటు చేయాలంటూ కేంద్ర మంత్రులు ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications