కరోనా బారిన శాసన మండలి ఛైర్మన్: త్వరగా కోలుకోవాలంటూ చంద్రబాబు, నారా లోకేష్
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడుతోన్న ప్రముఖుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనా వైరస్ బారిన పడ్డారు. కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట శాసనసభ్యుడు చిర్ల జగ్గిరెడ్డికి రెండురోజుల కిందట కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం వారిద్దరూ హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. తాజాగా శాసన మండలి ఛైర్మన్ మహ్మద్ షరీఫ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు.
Recommended Video

నారా లోకేష్ దిగ్భ్రాంతి
జ్వరం, దగ్గుతో బాధపడుతోన్న ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించగా.. కరోనా వైరస్ లక్షణాలు కనిపించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీనితో ఆయనను ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో షరీఫ్ చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. షరీఫ్‌కు కరోనా వైరస్ సోరడం పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు. ఈ మేరకు వారిద్దరూ వేర్వేరుగా ట్వీట్లు చేశారు.
షరీఫ్ సంపూర్ణ ఆరోగ్యంతో
ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న షరీఫ్ సంపూర్ణ ఆరోగ్యంతో, ఆత్మస్థైర్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు, నారా లోకేష్ చెప్పారు. షరీఫ్‌కు కరోనా వైరస్ సోకిందనే వార్త తనకు బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు. షరీఫ్ త్వరగా కోలుకోవాలని అకాంక్షిస్తూ పలువురు ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు ట్వీట్లను పోస్ట్ చేశారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్
రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తోంది. ప్రత్యేకించి ఏపీలో రోజూ 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో అత్యధికంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో ఏపీ రెండోస్థానానికి చేరుకుంది. వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు సోమవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారంలో రాష్ట్రంలో 4,31,876 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 3,27,631 మంది డిశ్చార్జి అయ్యారు. 3969 మంది కరోనా బారిన పడి మరణించారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,00,276గా నమోదైంది.












Click it and Unblock the Notifications