నా కన్నా సీఎం వైఎస్ జగన్‌కే సహనం ఎక్కువ: ఏపీ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ భావోద్వేగం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ గురువారం ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. మండలి ఛైర్మన్ షరీఫ్ పదవీకాలం ఈ నెలతో ముగియనుండటంతో.. సమావేశాల అనంతరం ఆయనకు వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పదవి ముగుస్తోందని, సభ్యులతో కొన్ని విషయాలు పంచుకోవాలన్నారు.
తనకు ఈ పదవి ఎవరో ఇచ్చారని అనుకోవడం లేదన్నారు. మండలిలో రాజధానుల బిల్లు సమయంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యానని తెలిపారు. ఒక దశలో రాజీనామా చేద్దామాని నిర్ణయించుకున్నట్లు షరీఫ్ తెలిపారు. అయితే, పదవి వల్ల తనకు చెడ్డపేరు రాకూడదని ఆగిపోయినట్లు చెప్పారు. అందరినీ ఒప్పించడానికి ప్రయత్నించినట్లు తెలిపారు.

'అందరూ నాకు సహనం ఎక్కువ అంటున్నారు. కానీ, నాకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సహనం ఎక్కువ. బిల్లు ఘటన జరిగిన మూడు రోజులకు ఓ కార్యక్రమంలో సీఎంను కలిశా. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా హై టీ కార్యక్రమంలో కలిశా. ఎప్పుడు కలిసినా సీఎం జగన్ చాలా అప్యాయంగా షరీఫ్ అన్న అని పలకరించారు' షరీఫ్ వెల్లడించారు.
'ఎందుకు కలత చెందారని స్వయంగా జగన్ అడిగారు. గతంలో ఏ పెద్ద పదవులు చేయలేదు. నేరుగా ఛైర్మన్ అయ్యానని చెప్పాను. మండలిలో కీలక నిర్ణయాల దృష్ట్యా కలత చెందానని సీఎంకు చెప్పా. నన్ను అత్యంత గౌరవంగా చూసుకున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు' అని షరీఫ్ భావోద్వేగానికి గురయ్యారు.
కాగా, గురువారం ఒక్కరోజు శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించి ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,29,779.27 కోట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శాసన మండలిలో హోం మంత్రి మేకతోటి సుచరిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తొలిసారి జెండర్ బేస్డ్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మహిళలు, చిన్నారులకు బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది. రూ.47,283 కోట్లతో జెండర్ బడ్జెట్ తెచ్చింది.












Click it and Unblock the Notifications