ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు తప్పిన ప్రమాదం
ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంత్రి అంబటి రాంబాబు కాన్వాయ్ ఆశ్వారావుపేట వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా.. అదే సమయంలో నాందేడ్ నుంచి విశాఖపట్నంకు గోధుమ బస్తాల లోడుతో ఓ లారీ వెళ్తోంది.
ఈ క్రమంలో సత్తుపల్లి శివారులోని హోండా షోరూం సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనంలోని కర్రలు గోధుమల లోడుకు తగలడంతో తాళ్లు తెగి రెండు గోధుమ బస్తాలు మంత్రి కారు బానెట్ పై పడ్డాయి. దీంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది.

ఘటన తర్వాత మరో కారులో మంత్రి అంబటి రాంబాబు ఖమ్మం వైపు వెళ్లిపోయారు. ఘటనపై మంత్రి పీఏ సత్తుపల్లి పోలీసులకు చెప్పడంతో ఆ లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీపై అంబటి రాంబాబు విమర్శలు
చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమని టీడీపీ నాయకులు, పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారని.. భువనేశ్వరి కూడా ఇదే మాట మాట్లాడుతున్నారన్న మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబు అరెస్ట్ చాలా సక్రమమని వ్యాఖ్యానించారు. చట్టబద్ధమైనది కూడా అని అన్నారు. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు ముందు ప్రవేశపెడతారని, కక్ష సాధింపు చేస్తే రిమాండ్ రిజెక్ట్ చేసేవారని తెలిపారు.
చంద్రబాబు తరపున ఢిల్లీ నుంచి వచ్చే పెద్ద పెద్ద అడ్వకేట్లు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో వాదిస్తున్నారన్నారు. ప్రాథమిక ఆధారాలు ఈ కేసులో ఉన్నాయన రిమాండ్ కు పంపారని మంత్రి అంబటి తెలిపారు. ఇది ఎలా అక్రమ అరెస్ట్ అవుతుందని టీడీపీ నేతలను అంబటి నిలదీశారు. భువనేశ్వరికి చంద్రబాబు అరెస్ట్ అక్రమంగా కనిపించడం సహజం.. భర్త అవినీతిపరుడైనా మంచివాడిగానే భావిస్తుందని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు. అయితే, ప్రజలు అందరూ కూడా అలా అనుకోవాలని కోరుకోవడం కరెక్ట్ కాదని అన్నారు.












Click it and Unblock the Notifications