నాకూ ఓ కులముంది-గుర్తుపెట్టుకోండి-ఖమ్మం దాడిపై అంబటి ట్వీట్..
ఏపీలో చంద్రబాబు అరెస్టు, అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయంగా మాటల యుద్ధం దాటి దాడుల వరకూ వెళ్తున్నాయి. ఇదే క్రమంలో తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు వ్యక్తిగత పనులపై వెళ్లిన ఏపీ మంత్రి అంబటి రాంబాబును అక్కడి టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టి కర్రలతో దాడి చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగేందుకు ప్రయత్నించిన అంబటి.. పరిస్ధితి గమనించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ దాడిపై స్పందిస్తూ అంబటి ఇవాళ ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో టీడీపీ పేరు ఎక్కడా ప్రస్తావించకుండానే ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండే వాక్యాల్లో పెట్టిన ఈ ట్వీట్ లో అంబటి కులాల ప్రస్తావన చేస్తూ టీడీపీకి చురకలు అంటించారు. ముఖ్యంగా తనకూ ఓ కులం ఉందంటూ అంబటి చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. అసలే టీడీపీ-జనసేన పొత్తుపై రోజూ వ్యాఖ్యలు చేస్తున్న అంబటి.. ఇవాళ్టి ట్వీట్ తో తన సామాజిక వర్గంలోనూ చర్చకు కారణమయ్యారు.

ఏపీ మంత్రి అంబటి రాంబాబు.. ఖమ్మం దాడి గురించి తన ట్వీట్ లో నేరుగా ప్రస్తావించకుండా కులోన్మాదంతో దాడి చేయాలనుకుంటే నాకూ ఓ కులముంది గుర్తుపెట్టుకోండి అంటూ వ్యాఖ్యానించారు. కింద నారా లోకేష్ ట్యాగ్ ను కూడా పెట్టారు. తద్వారా నారా లోకేష్ కు ఈ విషయం చెప్పేందుకు అంబటి రాంబాబు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు లోకేష్ ను కులోన్మాదులతో పోల్చినట్లు కూడా కనబడుతోంది.
రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు.. ఈ మధ్య పవన్ కళ్యాణ్ పై విమర్శలతో తన సొంత సామాజిక వర్గంలోనే టార్గెట్ అవుతున్నారు. మరోవైపు తన సామాజిక వర్గానికే చెందిన కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు టీడీపీ అభ్యర్ధిగా ఆయన నియోజకవర్గమైన సత్తెనపల్లికి ఇన్ ఛార్జ్ గా పంపారు. దీంతో చంద్రబాబు, పవన్ పొత్తుతో పాటు తాజా రాజకీయాలపై నిత్యం అంబటి విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో భువనేశ్వరిపై చేసిన విమర్శలకు టీడీపీ కార్యకర్లు ఆయన్ను టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications