అమరావతిపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు- మంత్రి అంబటి రియాక్షన్ ఇదే !
అమరావతి రాజధానిపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులో కొన్ని అంశాలపై స్టే ఇచ్చింది. దీంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు పాక్షికంగా స్టే ఇవ్వడం తమకు అనుకూలమని వైసీపీ సర్కార్, పూర్తి స్టేకు నిరాకరించడం తమ విజయమని విపక్షాలు చెప్పుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు దీనిపై స్పందించారు.
అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలపై స్పందించిన అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇవాళ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని కోట్ చేస్తూ అంబటి ట్వీట్ పెట్టారు. ఇందులో ఆయన.. రాజధాని నిర్మాణంలో న్యాయస్ధానాల జోక్యం సరికాదంటూ అత్యున్నత న్యాయస్ధానం చెప్పడం హర్షణీయమని వ్యాఖ్యానించారు. తద్వారా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తీర్పును మంత్రి అంబటి స్వాగతించారు.

అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల్లో కొన్ని, ఆరునెలల్లో మరికొన్ని పనులు పూర్తి చేయాలని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని ఇవాళ సుప్రీంకోర్టు తప్పుబట్టిన నేపథ్యంలో అంబటి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే రాజధాని విషయంలో హైకోర్టు తీరుపై, తీర్పుపై ఆగ్రహంగా ఉన్న వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో మంత్రి అంబటి కోర్టుల జోక్యంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని కోట్ చేస్తూ ఇది తమకు లభించిన విజయంగా పరోక్ష వ్యాఖ్యలు చేసినట్లయింది.













Click it and Unblock the Notifications