20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వం లక్ష్యం - మంత్రి గొట్టిపాటి
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఫోకస్ పెట్టింది. ప్రభుత్వం 160 గిగావాట్ల లక్ష్యంతో గ్రీన్ ఎనర్జీ పాలసీని అమలు చేస్తోందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రకటించారు. ఈరోజు ( ఆగస్టు 6, 2025 ) విజయవాడలో ఏపీఎస్ఎస్డీసీ - స్వనీతి ఇనీషియేటివ్ సంయుక్తంగా నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్‌లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పెట్టుబడులపై నమ్మకం..
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుత్పాదక విద్యుత్‌కు ప్రాధాన్యత ఇస్తూ గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకురావడం ద్వారా పెట్టుబడిదారుల్లో నమ్మకం నెలకొల్పిందన్నారు. గత ప్రభుత్వ కాలంలో పెట్టుబడిదారులు నమ్మకాన్ని కోల్పోయినా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రెజెంటేషన్ వల్ల ఇప్పుడు మళ్లీ ఆత్మవిశ్వాసం పెరిగిందని తెలిపారు.

గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా రాయలసీమ..
రాయలసీమ ప్రాంతం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు అత్యంత అనుకూలమైన వాతావరణం కలిగినదిగా మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే అనేక కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందాలు (MoUs) చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ప్రాజెక్టులన్నీ 2029 నాటికి పూర్తవుతాయని, అవి పూర్తయ్యాక విద్యుత్ వినియోగానికి అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు.
20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం..
ఈ ప్రాజెక్టుల అమలుకు కావాల్సిన నైపుణ్యం కోసం ఏపీఎస్ఎస్డీసీ ద్వారా యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణల ద్వారానే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల కల్పనను ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోందని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ (C-BG) ప్లాంట్ల ఏర్పాటు ద్వారా 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న సీబీజీ ప్లాంట్‌కు మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరిగి వలసలు తగ్గే అవకాశముందని మంత్రి తెలిపారు. ఇది గ్రామీణాభివృద్ధిలో కీలకంగా మారుతుందని వివరించారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతాయని, కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు కీలకంగా నిలుస్తాయని మంత్రి స్పష్టం చేశారు. సోలార్, విండ్, హైబ్రిడ్ టెక్నాలజీలను వినియోగిస్తూ విద్యుత్ ఉత్పత్తిని విస్తరించేందుకు చర్యలు చేపట్టుతున్నట్లు చెప్పారు.

అంతర్జాతీయ పెట్టుబడులకు మార్గం..
ఇండస్ట్రీ-ఫ్రెండ్లీ పాలసీ, మౌలిక వసతుల కల్పనతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నంలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వివరించారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాది వేస్తాయని, తద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీలో దేశానికి మార్గదర్శకంగా నిలవగలదని మంత్రి అభిప్రాయపడ్డారు. గ్రీన్ ఎనర్జీ విధానం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు యువతకు ఉపాధి, గ్రామీణాభివృద్ధి, పెట్టుబడుల వృద్ధి - ఇలా బహుళ ప్రయోజనాలు లభించనున్నాయి.












Click it and Unblock the Notifications