విజయవాడ, విశాఖకు బస్సుల్లేవా ? రంగంలోకి ఆర్టీసీ మంత్రి..!
ఏపీలో సంక్రాంతి పండుగ సందడి పూర్తయింది. పండుగ కోసం సొంత ఊళ్లకు వచ్చిన ప్రయాణికులంతా తిరుగుముఖం పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సులు సరిపోవడం లేదా ? తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రి బస్టాండ్ లో ప్రస్తుతం విజయవాడ, విశాఖకు వెళ్లాలంటే బస్సుల్లేవా ?, సరిగ్గా ఇదే అంశంపై ప్రయాణికుల నుంచి రవాణామంత్రికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో విజయవాడ, విశాఖ వైపునకు బస్సులు లేవంటూ ప్రయాణికులు ఫిర్యాదులు చేయడంతో రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. డిపిటిఓతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తగు ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ వైపుగా అదనంగా 2 సూపర్ లగ్జరీ, 2 ఆల్రెడీ బస్సులు ఏర్పాటు చేశామని , అదేవిధంగా నిన్న రాత్రి హైదరాబాద్‌కు వెళ్లిన బస్సులు తిరుగు ప్రయాణంలో ఉన్నట్లు అధికారులు ఆయనకు వివరణ ఇచ్చారు.

ఇవాళ సాయంత్రం 10 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రికి అధికారులు వెల్లడించారు. అలాగే చుట్టుపక్కల డిపోల నుంచి బస్సులు తరలించి ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతున్నట్లు డిపిటిఓ మంత్రికి తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టిన్నట్లు మంత్రికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు చెప్పడంతో ఆయన శాంతించారు. అయితే మంత్రి దృష్టికి వెళ్లే వరకూ రాజమహేంద్రవరం నుంచి విజయవాడ, విశాఖపట్నం వంటి కీలక నగరాలకు బస్సులు అందుబాటులో ఎందుకు ఉంచలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాగే ఏ డిపోలో బస్సులు లేవో ఆర్టీసీ మంత్రి చూసుకోవాలా అనే విమర్శలూ వస్తున్నాయి.












Click it and Unblock the Notifications